Telugu Gateway
Telugu

గుజరాత్ ఫైనల్-బిజెపి 99, కాంగ్రెస్ 80 సీట్లు

అంతిమ ఫలితం వచ్చేసింది. గుజరాత్ లో కమళదళం కొత్త రికార్డు నెలకొల్పింది. ఏకంగా ఆరవ సారి అధికారంలోకి వచ్చింది. దీంతో బిజెపి శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసిన దానికంటే కాంగ్రెస్ పార్టీ మెరుగైన పనితీరు కనపర్చినట్లే లెక్క. ఈ సారి బిజెపి 99 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 182 సీట్లు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలంటే 92 సీట్లు కావాలి. అలాంటిది బిజెపి అత్తెసరు మెజారిటీతో గుజరాత్ ను నిలబెట్టుకున్నట్లు లెక్క. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎలాంటి టెన్షన్లు ఉండవు. కాంగ్రెస్ పార్టీ 80 సీట్లను దక్కించుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ సీట్లు పెరిగాయి. అధికారంలోకి వస్తామని భారీ ఆశలే పెట్టుకున్నా..అది మాత్రం నెరవేరలేదు.

నువ్వా...నేనా అన్నట్లు సాగిన ప్రచారం ఉత్కంఠ రేపినా..అంతిమ ఫలితం అధికార బిజెపివైపే మొగ్గుచూపింది. ఈ ఫలితం సాధనలో క్రెడిట్ మొత్తం ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఒంటి చేత్తో గుజరాత్ ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలూ ఎదుర్కొన్నారు. గుజరాత్ ఫలితాలు నిరాశపర్చినా కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంత కుంగిపోవటం లేదు. భవిష్యత్ ఎన్నికల్లో గెలుపునకు ఇది నాంది అవుతుందని..మోడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము గట్టి పోటీ ఇవ్వగలిగామని భావిస్తోంది. పటేళ్ల ఉద్యమనాయకుడు హార్థిక్ పటేల్ అయితే ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బిజెపి గెలిచిందని...ఈ విషయంలో విపక్షాలు అన్నీ ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను ఈసీ వెంటనే ఖండించింది.

ఆ అవకాశమే లేదని తేల్చిచెప్పింది. రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు గట్టి మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని రుజువు చేశాయని అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తన స్పందనను ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్‌ చేస్తున్నానని, వారి వల్లే ఘనవిజయం సాధించామన్నారు. బీజేపీపై నమ్మకం ఉంచిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీయిచ్చారు.

Next Story
Share it