చంద్రబాబు ముఖ్యమంత్రా...అమరావతి ప్రధానా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి వచ్చిన సందేహం ఇది. ఈ సందేహం ఆయనకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా?. దీని వెనక బలమైన కారణమే ఉంది. అదేంటో మీరూ చూడండి. ‘ఏపీలో కొరియన్ సిటీని ఏర్పాటుచేస్తున్నాం. ఏపీని మీరు మీ రెండవ రాజధానిగా చేసుకోవాలని కోరుతున్నాం’ ఇదీ దక్షిణ కొరియాలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరిట ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన సారాంశం. ఏపీకి దక్షిణ కొరియా సంస్థలను ఆహ్వానించటాన్ని..ఆ దేశాలకు చెందిన పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటును ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఏది ఏమైనా కూడా ఓ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విదేశాలతో వ్యవహారాలు నడపలేదు. దీనికి కేంద్రం సాయం అవసరం ఉంటుంది. విదేశీ సంస్థలు భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే పలు నియమ, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ పెట్టుబడులు భారీ మొత్తంలో ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ)తోపాటు...విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపిబి) వంటి వాటి ద్వారానే అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే కొన్ని రంగాల్లో మాత్రం ఆటోమేటిక్ రూట్ ఉన్నా..అది కూడా కేంద్రం ద్వారానే రావాల్సి ఉంటుంది.
కానీ సాక్ష్యాత్తూ ఓ ముఖ్యమంత్రి ఏపీలో కొరియన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి..రాష్ట్రాన్ని రెండవ రాజధానిగా చేసుకోవాలని కోరటంపైనే అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓకే..చంద్రబాబు కోరినట్లు దక్షిణకొరియా అందుకు అంగీకరించినా..అది చంద్రబాబు పరిధిలోని అంశమా? అని ఓ ఉన్నతాధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలోనూ సీఎం చంద్రబాబు ఇలాంటి విచిత్ర ప్రకటనలు చాలా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా చంద్రబాబు కియా సంస్థ ప్రతినిధులతో పాటు అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దక్షిణకొరియా సాధించిన ప్రగతి తనను ముగ్ధుణ్ణి చేసిందని అన్నారు.
అనేక అవరోధాలను, ప్రతికూలతలను అధిగమించి దక్షిణకొరియా అభివృద్ధి సాధించిన తీరు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.
భౌగోళికంగా, జనాభా సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌కు, దక్షిణకొరియాకు సారూప్యతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తయారీ, సాంకేతిక రంగంలో దక్షిణకొరియా చాలా ముందంజలో ఉందని, ఇండియా ఇప్పుడు తయారీరంగంలో మెరుపువేగంతో దూసుకువెళ్తోందని తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు భారతీయులే అని తెలుపుతూ మా రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని... వాటిని వినియోగించుకోవాలని దక్షిణ కొరియా సంస్థలను ఆహ్వానించారు. ప్రపంచంలో భారత్ ఒక్కదానికే రెండంకెల వృద్ధి రేటును సాధించగల సామర్ధ్ద్యం ఉంది. గడచిన మూడేళ్లుగా ఏపీ సుస్థిరంగా రెండంకెల వృద్ధి సాధిస్తోంది. వచ్చే 15 ఏళ్లపాటు 15 శాతం వృద్ధి నమోదు చేయాలన్నదే తమ లక్ష్యం అని తెలిపారు.