Telugu Gateway
Telugu

అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి సమన్లు

జయలలిత మృతి వ్యవహారం కొత్త మలుపుతిరిగింది. ఈ అంశంపై విచారణ చేస్తున్న కమిషన్ శుక్రవారం నాడు కొత్తగా అపోలో ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయనతోపాటు శశికళ, అపోలో వైస్ ఛైర్మన్ ప్రీతారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన వైద్య సేవల విషయంపై అపోలో ఆస్పత్రి కూడా గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వీరు ముగ్గురూ 15 రోజుల్లోగా నేరుగా విచారణకు హాజరు కావాలని కమిషన్‌ ఆదేశించింది. అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. జయలలితన శ్వాస తీసుకోలేని స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందించామని ప్రీతారెడ్డి ఢిల్లీలో ఓ తమిళ చానెల్‌కు గతంలో వెల్లడించారు.

మరోవైపు జయను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆమె జ్వరంతో బాధపడుతున్నారనే ప్రకటనను ఇచ్చినట్లు అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి కూడా పేర్కొన్న విషయం విదితమే. అంతేకాకుండా జయలలితకు చికిత్స జరుగుతున్న సమయంలో శశికళ... ఎవరినీ లోనికి అనుమతించలేదని, జయను చూడనివ్వలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో ను ఆర్కే నగర్ ఉప ఎన్నికను పురస్కరించుకుని అనూహ్యంగా బుధవారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ వర్గానికి చెందిన, శాసనసభలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే వెట్రివేల్‌ ఈ వీడియో విడుదల చేశారు.

Next Story
Share it