Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డికి కీలక పదవి

అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి కీలక పదవి దక్కనుంది. తెలాంగాణ ఇచ్చిన పార్టీగా ఎలాగైనా 2019 ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. గత కొంత కాలంగా వరస పెట్టి సాగుతున్న చేరికలు పార్టీకి నూతనోత్సాహన్ని ఇస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదిలేందుకు సైతం రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో బాగంగానా అన్నట్లు త్వరలోనే ఇటీవలే పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి కీలక పదవి దక్కనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో ఆయనతో కలసి పార్టీలో చేరిన సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డిలకు ఎమ్మెల్యే టికెట్లు ఖాయమని ఉత్తమ్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా చిట్‌ చాట్‌తో మాట్లాడిన ఆయన పలు అంశాలపై స్పందించారు. రేవంత్ రెడ్డి పార్టీలో చేరకముందే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయి వచ్చిన విషయం తెలిసిందే. ఈ భేటీలోనే పలు అంశాలపై స్పష్టత తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. ఇప్పుడు కూడా అదే పదవి ఆయనకు దక్కొచ్చని భావిస్తున్నారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇస్తూ రేవంత్ రెడ్డికి కీలక పదవి అంశం గురించి ప్రస్తావించినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీచేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు‌, ఆయన తనయుడు రామారావులు ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వేల్‌, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని ఉత్తమ్‌ కుమార్‌ గుర్తుచేశారు. హరీశ్‌రావు నియోజకవర్గం సిద్ధిపేటలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిజెపిలో ఉన్న సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరతాని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాకరించారు.

Next Story
Share it