Telugu Gateway
Telugu

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై జియో ఎఫెక్ట్‌

జియోకు..ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధం ఏంటి అంటారా?. ఖ‌చ్చితంగా ఉంది. ఏడాది పాటు దేశంలోని టెలికం కంపెనీల‌ను అత‌లాకుత‌లం చేసిన జియో చేసిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు. జియో ఆఫ‌ర్ల‌తో దేశంలోని అగ్ర‌శ్రేణి టెలికం కంపెనీలు కూడా అల్ల‌క‌ల్లోలం అయిపోయాయి. కొన్నింటికి లాభాల్లో భారీ కోత ప‌డ‌గా..మ‌రికొన్ని న‌ష్టాల‌ను కూడా చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఆదాయాలు త‌గ్గి..బ్యాంకుల‌కు చెల్లించాల్సిన రుణాలు కూడా డిఫాల్ట్ అయ్యే ప‌రిస్థితి ఉంద‌ని నివేదిక‌లు వెలువ‌డ్డాయి. ఏడాది త‌ర్వాత జియో కూడా టారిఫ్ ప్లాన్ల‌ను ప్ర‌క‌టించ‌టంతో త‌ర్వాత అగ్ర‌శ్రేణి కంపెనీలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. అయినా పోటీని త‌ట్టుకుని వినియోగ‌దారుల‌ను నిల‌బెట్టుకునేందుకు మిగిలిన సంస్థ‌లు కూడా త‌మ ప్లాన్స్ ను పున‌ర్ ర‌చించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంటే ఒక కంపెనీ అలా మార్కెట్లోకి వ‌చ్చి ఇంత‌గా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేలా అడుకోగ‌ల‌దా?. అంటే రిల‌య‌న్స్ జియో అది ఏంటో చేసి మ‌రీ చూపించింది.

తాజాగా మ‌రో సంచ‌ల‌నాత్మ‌క విష‌యం వెలుగులోకి వ‌చ్చింది ఇప్పుడు. జియో ఎఫెక్ట్ తో ప‌లు కంపెనీల ఆర్థిక సంక్షోభం లోకి వెళ్లిన ఏడాది కాలంలో 75వేల ఉద్యోగాలు పోయాయి. . అంతేకాదు జియో ప్రభావం మరింత ప్రమాదకరంగా ఇక ముందు పెరిగే అవకాశంఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఉపాధి లేక రోడ్డున పడే ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంద‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. టెలికం కంపెనీలు సాధ్య‌మైనంత మేర ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను త‌గ్గించుకుంటున్నాయి. గత ఏడాది మూడు లక్షలమంది ఉద్యోగులను వివిధ టెలికాం కంపెనీలు నియమించుకోగా వీరిలో 25శాతం మందిపై వేటు పడిందని ఓ నివేదిక బ‌హిర్గ‌తం చేసింది. ఈ ప‌రిణామాలు అన్నీ ఖ‌చ్చితంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపిస్తాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Next Story
Share it