Telugu Gateway
Telugu

ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

ఓ వైపు సినీ రంగంలోని ప్రముఖులు రాజకీయాల్లోకి దూసుకొచ్చేందుకు రెడీ అవతున్న తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే చిరంజీవి పార్టీ పెట్టి..కాంగ్రెస్ లో విలీనం చేయగా..ఆయన తమ్ముడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పేరుతో పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాడు.మరోవైపు తమిళనాడులో కమల హాసన్, రజనీకాంత్ లో రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రెడీ అయిపోయారు. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమా వాళ్లు రాజకీయాల్లో వస్తే గనుక దేశం నాశనమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే తాను వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించడం, రాజకీయ పార్టీలు పెట్టడాన్ని సమర్థించనంటూ బెంగళూరులో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వ్యాఖ్యానించారు.

‘ప్రతి నటుడికి కుల, మతాలకు, వర్గాలకు అతీతంగా అభిమానులు ఉంటారు. రాజకీయాలు అనేవి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని వర్గాల అభిమానులను దూరం చేస్తాయి. అభిమానుల పట్ల నటులు బాధ్యతతో ప్రవర్తించాలంటే అలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది’ అని ప్రకాష్‌ రాజ్‌ తేల్చిచెప్పారు. ఇక నటులు రాజకీయాల్లోకి రావటాన్ని ప్రకృతి విపత్తుతో పోల్చిన ఆయన.. థియేటర్లలో జాతీయ గీతం వచ్చే సమయంలో లేచి పౌరులు దేశభక్తిని నిరూపించుకోవాలా.. అని ప్రశ్నించారు. బెంగుళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత కూడా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తన కంటే పెద్ద నటుడు అని వ్యాఖ్యానించి ప్రకాష్ రాజ్ కలకలం రేపారు.

Next Story
Share it