Telugu Gateway
Telangana

వ‌చ్చే ఏడాది నుంచి తెలంగాణ‌లో కొత్త చ‌రిత్ర‌

తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంవ‌త్స‌రం నుంచి నూత‌న చ‌రిత్ర ప్రారంభం కాబోతుంద‌ని ముఖ్య‌మంత్రి కెసీఆర్ ప్ర‌క‌టించారు. ఆయ‌న సోమ‌వారం నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2018 జ‌న‌వ‌రి నుంచి రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని ప్రకటించారు. 24 గంటల విద్యుత్‌తో రాష్ట్రానికి మ‌రిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు అవసరం లేదన్న సండ్ర వెంకట వీరయ్య, చిన్నారెడ్డి ఒక్క విషయాన్ని గమనించాలని సీఎం సూచించారు. మార్కెట్ కమిటీలు, కో ఆపరేటివ్స్ సొసైటీలు ఉన్నాయి.. రైతు సమన్వయ సమితులు ఎందుకని వెంకట వీరయ్య ప్రశ్నిస్తున్నారు.. మరి టీడీపీ ప్రభుత్వం 2005లో రైతు మిత్ర బృందాలు ఎందుకు ఏర్పాటు చేశారని అన్నారు. లక్షల రైతు మిత్ర బృందాలు ఏర్పాటు చేసి రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారని సీఎం తెలిపారు. 2005లో 50 వేల మంది ఆదర్శ రైతులను ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 60 కోట్లు ఖర్చు చేసి.. ఆదర్శ రైతులుగా ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లను నియమించారని సీఎం తెలిపారు.

కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉన్న తెలంగాణలో 23 లక్షల 62 వేల పంపుసెట్లు ఎవరి పుణ్యమా అని వచ్చాయని సీఎం ప్రశ్నించారు. ఆడపడుచులు తమ తాళిబొట్టును కుదువపెట్టి వ్యవసాయానికి ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణకు 1330 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే ఎన్ని టీఎంసీలు వాడారు? వాడకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం? కాదా అని ప్రశ్నించారు. 45 వేల చెరువులు ఉంటే.. 4 చెరువుల్లో అయినా పూడిక తీశారా? మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. 9 గంటల కరెంట్ ఎప్పుడైనా వచ్చిందా? 2 లేదా 3 గంటలు కరెంట్ వస్తే మహాగొప్ప.. ఇవన్నీ నేరపూరిత నిర్లక్ష్యం కాదా? అని సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు. వివక్ష వహించని మొదటి ప్రభుత్వం తమది. వందశాతం నిష్పక్షపాత వైఖరితో ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వంలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 3 కోట్లు ఇస్తున్నాం. మీరిచ్చిరా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

Next Story
Share it