నాని నిర్మాతగా ‘అ’
హీరో నాని ఉన్నట్లుండి సడన్ గా ఓ కొత్త విషయం ప్రకటించేశాడు. తాను నిర్మాతగా మారానని. ఆ సినిమా ఫస్ట్ లుక్ ఇదే అంటూ టాలీవుడ్ తో పాటు...అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘అ’ సినిమా కు ఉప శీర్షికగా ‘ప్రపంచంలో నేను...నాలోని ప్రపంచం’ అని రాసి ఉంది. ఈ ఫస్ట్ లుక్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. కాఫీ కప్ లో ‘అ’ అని రాయటంతో పాటు...భగవద్గీత పుస్తకం..రోజా పువ్వు రేకులు..పేపర్ తో చుట్టి ఉన్న తుపాకీ ఉన్నాయి. ఇందులో మరో విశేషం ఉంది. ఈ ప్రచార చిత్రంలో నిత్యామేనన్, కాజల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బా, మురళీ శర్మ, రోహిని, దేవదర్శిని సుకుమారన్ పేర్లు ఉన్నాయి. సో...వీళ్ళంతా ఈ సినిమాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ సినిమాకు నాని, రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఫస్ట్ లుక్ కు ముందే ఓ వీడియో సందేశం ద్వారా తాను నిర్మాతగా మారిన విషయాన్ని నాని వెల్లడించారు.
నాని నిర్మాతగా మారటం కూడా విచిత్రంగానే జరిగిందని చెప్పొచ్చు. ఆ విషయాన్ని నానినే స్వయంగా తెలిపారు. అదేంటో మీరూ చూడండి. ‘ ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్ అనే కొత్త అబ్బాయి వచ్చి నాకు కథ విన్పించాడు. ఆ కథలో చిన్న పాత్రకు నా వాయిస్ ఓవర్ అడిగాడు. కథ చాలా కొత్తగా..విభిన్నంగా అనిపించింది. ఇంతకు ముందు తెలుగు ప్రజలు ఇలాంటి కథను స్ర్కీన్ మీద చూడలేదు అనిపించింది. ఇలాంటి ఆలోచనకు ఓ మంచి బృందం,, సపోర్ట్ చాలా అవసరమని అన్పించింది. ఎవరు నిర్మిస్తున్నారు అడిగా, ఇంకా తెలియదు, ఏదో విధంగా మేనేజ్ చేస్తా అన్నాడు. అలా మేనేజ్ చేసే సినిమా కాదు ఇది, బాగా తీయాలి అని..నేనే ఎందుకు నిర్మించకూడదు అని ..ఈ సినిమాను నిర్మిస్తానని ప్రశాంత్ కు చెప్పాను ’ అని వివరించాడు నాని. ఈ కొత్త సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.