Telugu Gateway
Cinema

‘బాలకృష్ణుడు’ మూవీ రివ్యూ

నారా రోహిత్. హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అందులో భాగంగానే ఈ శుక్రవారం నాడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలకృష్ణుడు పేరుతో వచ్చిన ఈ సినిమాలో నారా రోహిత్ కు జోడీగా రెజీనా కసాండ్రా నటించగా..మరో కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించారు. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన పవన్ మల్లెల ఈ సినిమాను తెరకెక్కించారు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమాతో అయినా నారా హీరోకు హిట్ దక్కిందా?. లేదా తెలుసుకోవాలంటే ముందుకు సాగాల్సిందే. ఇక సినిమాలో అసలు కథ విషయానికి వస్తే కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంతో సినిమా కథ మొదలవుతుంది. రవీందర్ రెడ్డి (ఆదిత్య) ఆ ప్రాంత ప్రజల జీవితాలను మార్చాలనుకునే ప్రజల మనిషి, తన చెల్లెలు భానుమతి దేవీ (రమ్యకృష్ణ) ఆలోచనల ప్రకారం తమ ప్రాంతంలో కాలేజీలు ఫ్యాక్టరీలు కట్టి అందరికీ చదువు, ఉద్యోగం అందుబాటులోకి తెచ్చి తమ ప్రాంతం నుంచి వలసలు లేకుండా చేయాలని చూస్తాడు.

జనంలో రవీందర్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థి బసిరెడ్డి (మహదేవన్) కసి పెంచుకుంటాడు. కానీ రవీందర్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చావును కళ్లారా చూసిన బసిరెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్) దొంగ దెబ్బతీసి రవీందర్ రెడ్డిని చంపేస్తాడు. తాను పోయినా తన ఆశయం మాత్రం బతకాలని ఆఖరి నిమిషంలో చెల్లెలితో మాట తీసుకుంటాడు రవీందర్ రెడ్డి. అన్నకిచ్చిన మాట కోసం ప్రతాపరెడ్డి లాంటి రాక్షసుడితో పోరాటానికి సిద్ధమవుతుంది భానుమతి. రవీందర్ రెడ్డిని చంపిన కేసులో ప్రతాపరెడ్డి జైలుకెళతాడు. తన అన్నకూతురు ఆధ్య (రెజీనా) ఈ గొడవలకు దూరంగా పెంచుతుంటుంది భానుమతి. పదకొండేళ్ల తరువాత సత్ప్రవర్తన కింద ప్రతాపరెడ్డి జైలు నుంచి విడుదలవుతున్నాడని తెలుసుకున్న భానుమతి, తన ఆధ్యని కాపాడేందుకు బాలు (నారా రోహిత్)ను బాడీ గార్డ్ గా పెడుతుంది. అయితే తాను బాడీగార్డ్ గా ఉన్నాననే విషయం తెలియకుండా ఉండాలనే కండిషన్ కారణంగా ప్రేమలో పడేసేందుకు ఈ పాట్లుపడుతున్నట్లు నటిస్తాడు బాలు. ఇదంతా తెలియని ఆద్య నిజంగానే బాలుతో ప్రేమలో పడుతుంది. మరి బాడీగార్డ్ వచ్చిన బాలుతో ఆద్య ప్రేమ సక్సెస్ అవుతుందా? లేదా వెండితెరపై చూడాల్సిందే. ఎన్నో సినిమాల్లో వచ్చిన పాత కథనే తీసుకుని మరో ప్రయత్నం చేశాడు దర్శకుడు. దీంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయారు.

పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలో నటించిన నారా రోహిత్, అందుకు తగ్గ ఫిజిక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా మార్పులు చూపించాడు. అయితే కథలో దమ్ములేకపోవటంతో సినిమా కాస్తా తేలిపోయింది. హీరోయిన్ గా రెజీనా ఆధ్య పాత్రలో అలరించింది. అభినయంతో పాటు అందాల ప్రదర్శనతోనూ ఆకట్టుకుంది. కీలకమైన భానుమతి పాత్రలో రమ్యకృష్ణ నటన సినిమాకు ఓ బలం. విలన్ గా అజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. డిస్కవరీ ఫొటోగ్రాఫర్ మాధవరావు పాత్రలో పృథ్వీనే సినిమాలో కాస్త రిలీఫ్ ఇస్తాడు ప్రేక్షకులకు. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు ఉన్నా ఆయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. నిర్మాణ విలువలు..కెమెరా పనితనం బాగున్నా కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటంతో ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచిచూడాల్సిందే.

రేటింగ్. 1.75/5

Next Story
Share it