Home Telugu పాక్ చేతిలో చిత్తు..చిత్తుగా ఓడిన భారత్

పాక్ చేతిలో చిత్తు..చిత్తుగా ఓడిన భారత్

virat

చాంఫియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో  భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ చేతులెత్తేసింది. పాకిస్థాన్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. అదీ భారత్ పై కావటంతో ఆ టీమ్ కు అది మరింత ఆనందాన్ని ఇచ్చే అంశం. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అయినా..అది ఓ పోరాటం అన్న చందంగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్ ముందు 339 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ బ్యాట్స్ మెన్ ఏ దశలోనూ ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు కన్పించలేదు. ప్రారంభం నుంచి వికెట్లు టప టపా పడుతుంటే భారత అభిమానులకు సీన్ అర్థం అయిపోయింది. ఇది గెలిచే మ్యాచ్ కాదన్నట్లు. అందరి అంచనాల ప్రకారం భారత్ టీమ్ చేతులెత్తేసింది. మళ్లీ అలా ఇలా కాదు. ఏకంగా 180 పరుగుల తేడాతో పరాజయం మూటకట్టుకుంది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరులో భారత్ జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో విరాట్ సేన చిత్తు చిత్తుగా ఓడిపోయింది.

                         టాప్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందడంతో భారత జట్టు జీర్ణించుకోలేని పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్క హార్దిక్ పాండ్యా(76; 43 బంతుల్లో 4 ఫోర్లు,6 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరూ ఆకట్టుకోలేకపోవడంతో భారత్ అతి పెద్ద ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. హార్దిక్ తరువాత శిఖర్ ధావన్(21), యువరాజ్(22)లు మాత్రమే రెండెంకల స్కోరును దాటిన ఆటగాళ్లు. రోహిత్ శర్మ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, విరాట్ కోహ్లి(5) ఎంఎస్ ధోని(4), కేదర్ జాదవ్(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. అమీతుమీ పోరులో భారత్ జట్టు 30.3 ఓవర్లలో 158 పరుగులకే దుకాణం కట్టేసింది. వరుసగా రెండో సారి ఛాంపియన్  ట్రోఫీ సాధించాలనుకున్న భారత్ ఆశ నెరవేరలేదు. మరొకవైపు తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరిన పాకిస్తాన్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది.

                        పాకిస్తాన్ బౌలర్లలో మొహ్మద్ అమిర్, హసన్ అలీ తలో మూడు వికెట్లతో భారత్ జట్టు వెన్నువిరవగా, షాదబ్ ఖాన్ కు రెండు, జునైద్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.  పాకిస్తాన్ ఓపెనర్లు ఫకార్ జమాన్(114;106బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ అలీ(59;71బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్)లతో పాటు బాబర్ అజమ్(46;52 బంతుల్లో 4 ఫోర్లు), మొహ్మద్ హఫీజ్(57 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్సర్లు) లు మెరిసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు జమాన్, అజహర్ అలీలు శుభారంభం అందించారు.  ఈ జోడి తొలి వికెట్ కు 128 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ముందు అజహర్ అలీ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై జమాన్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఆపై వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడే క్రమంలో అలీ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. మొత్తం మీద పాక్ టీమ్ నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు సాధించి భారత్ టీమ్ ను ఒత్తిడికి గురిచేసింది. అంతిమంగా ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here