Telugu Gateway
Telangana

బీజేపీ ని కట్టడి చేయటమే రేవంత్ కు సవాల్!

బీజేపీ ని కట్టడి చేయటమే రేవంత్ కు సవాల్!
X

తెలంగాణాలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్. కానీ అదేమీ విచిత్రమో తెలంగాణ రాజకీయాలు మొత్తం బీజేపీ చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణాలో బీజేపీ క్రమక్రమంగా బలబడుతుండటం కూడా దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కీలక సమయంలో బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి బీజేపీ అధిష్టానం కాంగ్రెస్ నెత్తిన పాలు పోసింది అనే చెప్పాలి. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది అనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దూకుడు తో పాటు బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కి బాగా కలిసివచ్చింది. లోక్ సభ ఎన్నికల దగ్గర కు వచ్చేసరికి లెక్కలు ఏమైనా మారతాయా అన్న టెన్షన్ పార్టీల్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పదిహేడు లోక్ సభ సీట్లలో ఇప్పటి వరకు అత్యధిక సీట్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కే వస్తాయనే సర్వేలు అన్నీ చెపుతున్నాయి.

రెండవ స్థానంలో బీజేపీ ఉంటే..ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ మూడవ స్థానానికి పరిమితం అయ్యే సూచనలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి తీహార్ జైలు లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కోసం బిఆర్ఎస్ సుపారీ తీసుకుంది అని...ఐదు లోక్ సభ సీట్లలో బీజేపీ ని గెలిపించేందుకు బిఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బిఆర్ఎస్, బీజేపీ లు కలిసి పనిచేస్తున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసి దీని ద్వారా రాజకీయ లబ్ది పొందటానికి చూస్తున్నారు. మరో వైపు బిఆర్ఎస్ కూడా ఇదే పని చేస్తోంది. గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు లు పదే పదే సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే తన వర్గాన్ని తీసుకుని వెళ్లి బీజేపీ లో చేరతారు అంటూ ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఫస్ట్ బీజేపీ లో చేరేది రేవంత్ రెడ్డే అంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే పనిలో ఉన్నారు.

తాజాగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా కేటీఆర్, హరీష్ రావు ల బాటలోనే రేవంత్ రెడ్డి కూడా బీజేపీ లోకి జంప్ కొడతాడేమో తెలియదు అంటూ మాట్లాడారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా బీజేపీ చుట్టూనే రాజకీయాలు చేయటం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీ లోకి వెళ్తాడు అనే ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో అనుమానాలు రేపి లబ్ది పొందాలనేది ఆ పార్టీ ప్లాన్. కవిత బెయిల్ కోసం బిఆర్ఎస్ బీజేపీ తో బేరాలు కుదుర్చుకుంది అని చెప్పటం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కించుకుని తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. మరో వైపు బీజేపీ కూడా ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణాలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా అధికారం తమదే అనే బలమైన సంకేతాలు పంపటానికి ఛాన్స్ ఉంటుంది అనే నమ్మకంతో పని చేస్తోంది. మరి ఇందులో ఎవరి ప్లాన్స్ వర్క్ అవుట్ అవుతాయో తేలాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిఆర్ఎస్ బలహీనపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ ని కట్టడి చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ కు..రేవంత్ రెడ్డి కి అత్యంత కీలకం కానుంది.

Next Story
Share it