Telugu Gateway
Telangana

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి  నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
X

కార్మిక నాయకుడు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. సీఎం కెసీఆర్ ఆయన్ను బుధవారం రాత్రే పరామర్శించి..కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాయిని నర్సింహారెడ్డి వయస్సు 80 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన పార్టీ తనను పక్కన పెట్టిందనే అసంతృప్తితో ఉన్నారు. నాయిని కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత న్యూమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు వి.శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌. రాజకీయాల్లో నాయిని నరసింహరెడ్డిది ప్రత్యేక శైలి. హోం మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరు చాలా సాదాసీదాగానే ఉండేది. ఎక్కడా కూడా అధికారదర్పం చూపించకుండా మొదట నుంచి ఎలా అయితే ఉన్నారో అదే తరహాలో కొనసాగారు.

సోషలిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అందరికీ అందుబాటులో ఉండే కార్మికనేతగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన నాయిని రాష్ట్ర రాజకీయాల్లో జెయింట్‌ కిల్లర్‌గా అప్పట్లో సంచలనం సృష్టించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒకవైపు ఇందిరా కాంగ్రెస్‌ నుంచి అప్పటి కార్మిక మంత్రి టి.అంజయ్య, మరోవైపు రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డిలతో ఆయన ఢీ కొన్నారు. ఆ ఇద్దరినీ ఓడించారు. 2,167 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించి జెయింట్‌ కిల్లర్‌గా ఖ్యాతిపొందారు. 1985లో రెండోసారి, 2004లో మూడోసారి అదే స్థానం నుంచి గెలుపొందారు. 2004లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మంత్రిగా సేవలందించారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలగిన సమయంలో అమెరికాలో ఉన్న నాయిని అక్కడి నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను చాటుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై హోంమంత్రిగా, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటి ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాయిని కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ వాసిగా పరిచయం అయిన నాయినిది వాస్తవానికి నల్లగొండ జిల్లా. జిల్లాలోని చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన నాయిని నర్సింహారెడ్డి ఫిబ్రవరి 12, 1940లో జన్మించారు. హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకున్నారు. మొదటి నుంచే చురుకైన విద్యార్థిగా ఉంటూ వచ్చిన నాయిని ఆ ప్రాంతంలో జరిగే ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొనేవారు.

Next Story
Share it