Telugu Gateway
Telangana

కెసీఆర్ నోట మళ్ళీ అదే మాట

కెసీఆర్ నోట మళ్ళీ అదే మాట
X

ముఖ్యమంత్రి కెసీఆర్ ఉద్యోగులకు మరోసారి అదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, సమస్యలను పరిష్కరించునున్నట్లు తెలిపారు. కొద్ది నెలల క్రితం కూడా ఉద్యోగ సంఘ నేతలకు ఇదే మాట చెప్పారు. తెలంగాణకు చెందిన ఉద్యోగ సంఘ నేతలు శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలసి వరద బాధితుల సాయం కోసం ఉద్యోగులు ఒక రోజు వేతనం 33 కోట్ల రూపాయలు అందించేందుకు అనుమతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగానే ఆయన ఈ హామీ ఇచ్చారు. ఉద్యోగుల డీఎకు సంబంధించిన అంశంపై సీఎం కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న డిఏ విషయంలో విధానం మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

''ప్రస్తుతం డిఏ ఎంత అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. దాన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం మూడు డిఏలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రెండు డిఏల విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కేంద్రం తీసుకునే నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తున్నది. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగులకు సకాలంలో డిఏ అందడం లేదు. ఈ పరిస్థితి మారాలి.

ప్రతి ఆరు నెలలకు ఒక సారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డిఏ నిర్ణయించాలి. కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలి. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డిఏ ప్రకటించి అమలు చేయాలి. కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే మిగిలిన 0.5 శాతం చెల్లించాలి. 2.5 గా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి చెల్లించాలి. ఈ విషయంలో వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలి. కేబినెట్లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటాం'' అని సిఎం వెల్లడించారు. 2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక డిఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని ఆర్థిక శాఖను సిఎం ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

Next Story
Share it