Home Latest News జాదవ్ ను ఉరితీస్తే అంతే అన్న భారత్

జాదవ్ ను ఉరితీస్తే అంతే అన్న భారత్

sushma swaraj

భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై పార్లమెంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జాదవ్‌కు న్యాయం జరిగేలా ఏం చేసేందుకైనా సిద్ధమని భారత్ స్పష్టంచేసింది. జాదవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది. భారత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, ఉగ్రవాదులకు సహకరించడంలో ఘనమైన రికార్డు ఉన్న పాకిస్థాన్.. తన చర్యలనుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు జాదవ్‌కు మరణశిక్ష ఖరారు చేసిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకుడు, అపహరణకు గురైన జాదవ్‌కు న్యాయం జరిగేందుకు భారత్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానంలో ఆమె స్పష్టంచేశారు. జాదవ్‌కు మరణశిక్ష అమలు చేయడాన్ని ఉద్దేశపూర్వక హత్యగా భారత్ భావిస్తుంది. శిక్ష అమలు చేయాలనే నిర్ణయించుకున్న పక్షంలో దీని పర్యవసానాలు ద్వైపాక్షిక సంబంధాలపై ఎలా ఉంటాయో పాకిస్థాన్ ఆలోచించుకోవాలి అని సుష్మ హెచ్చరించారు.

                              ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను అపహరించి పాకిస్థాన్‌కు పట్టుకుపోయి ఆయనపై మోపిన అభియోగాలన్నీ కట్టుకథలేనని, విచారణ మొత్తం బూటకమని సుష్మ ఆరోపించారు. సైనిక కోర్టు తీర్పు ఏ విధంగానూ సమర్థనీయంగా లేదని స్పష్టంచేశారు. ఎలాంటి విచారణ లేకుండా, చట్టం, న్యాయం అంతర్జాతీయ సంబంధాలు అన్నీ ఉల్లంఘించి పాకిస్థాన్ ఒక అమాయక భారత పౌరుడికి మరణశిక్ష విధించడాన్ని దేశ ప్రజలు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణనిస్తున్నట్టు నేను స్పష్టంచేయదల్చాను అని సుష్మ తెలిపారు. పాకిస్థాన్‌లో ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాస్తవాలు ధ్రువీకరించుకునేందుకు ఆయనతో భారత కాన్సులేట్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి అని చెప్పామని, కానీ.. ఈలోపే అసాధారణంగా ఆయనకు మరణశిక్షను పాకిస్థాన్ ఖరారు చేసిందని సుష్మ ఆరోపించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here