Home Cinema ‘రాజు గారి గది 2’ మూవీ రివ్యూ

‘రాజు గారి గది 2’ మూవీ రివ్యూ

Raju-Gari-Gadhi-2

రాజుగారి గది 2 సినిమాకు సమంత ఓ ప్రత్యేకత తెచ్చిపెట్టింది. పెళ్ళికి ముందు చేసిన సినిమానే అయినా..ఆమె పెళ్ళి అయిన వెంటనే రిలీజ్ అయిన సినిమా ఇది. ఇందులో మరో విశేషం ఏమిటంటే మామ అక్కినేని నాగార్జున..కోడలు సమంతలు కలసి నటించిన సినిమా కూడా కావటం మరో ముఖ్యాంశం. రాజు గారి గది సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న ఓంకార్ దీనికి సీక్వెల్ గా రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించారు. మలయాళ సినిమా ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన రాజు గారి గది 2  శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకునేందుకు మరింత ముందుకు వెళదాం..ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే అమృత (సమంత) తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. తండ్రి రావు రమేష్ సంరక్షణలో పెరిగి పెద్దవుతుంది. స్కూల్ లో ఓ సందర్భంలో టీచర్ పిల్లలను పెద్దయ్యాక ఎవరేమి అవుతారు అని అడుగుతారు. అప్పుడు అమృత తాను లాయర్ అవుతానని చెబుతుంది. కారణం ఏమిటని అడిగితే తన తల్లిని తన చిన్నతనంలోనే ఎందుకు తీసుకెళ్ళాడో దేవుడిని బోనులో నిలబెట్టి అడుగుతానని చెబుతుంది.

                           చెప్పినట్లే లా పూర్తి చేసి..కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ గా గుర్తింపు పొందుతుంది. కాలేజీ తరపున పిక్నిక్ వెళ్లిన సందర్భంలో అమృత స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి యూ ట్యూబ్ లో పెడతారు. ఇది చూసి అవమానాలు ఎదుర్కోలేక సమంత తండ్రి చనిపోతాడు. ఆ కొద్ది రోజులకే తల్లి లేక..తండ్రి లేక అన్న బాధతో పాటు..కాలేజీలో ఎదురయ్యే చీత్కరింపులతో అమృత కూడా కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు అమృత వీడియో తీసింది ఎవరు..ఏమి ఆశించి పనిచేశారు అన్నది వెండితెరపై చూడాల్సిందే. ఈ కేసును చేధించేందుకు పోలీసులకు మనిషి కళ్లలోకి చూసి వాళ్ల ఆలోచనలు కనుగోనే పాత్రలో రుద్రగా (నాగార్జున) నటించారు. ఈ సినిమాకు ఆయన పాత్ర..సమంత పాత్రలే చాలా కీలకం. సినిమా తొలి భాగంలో ఎక్కువ శాతం  అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) ముగ్గురితో హంగామాతోనే నడుస్తుంది. వీరు ముగ్గురూ క లసి ఓ రిసార్ట్ నిర్వహిస్తుంటారు. వీళ్లుండే గదిలోనే ఓ దెయ్యం ఉంటుంది. అది చేసే హంగామా అంతా ఇంతా కాదు.

                                ఫస్టాఫ్ లో కామెడీ అంతా ‘జబర్ధస్త్’ కార్యక్రమం నుంచి కాపీ కొట్టినట్లు ఉంది. అన్ని పంచ్ లు అందులోనివే. ఈ సినిమాలో నాగార్జున..సమంతల క్యారెక్టర్లే అత్యంత కీలకం. నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో తనదైన ముద్ర వేశారు. విచిత్రం ఏమిటంటే సమంత ఈ సినిమాలో దెయ్యంగా కన్పించటమే. మరో హీరోయిన్ సీరత్ కపూర్ కు నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్  ఒలకబోసింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది. స్టోరీకి అత్యంత కీలకంగా మారిన ఓ పాత్రలో అభినయ నటన ఆకట్టుకుంది. సినిమాలో సందేశం కూడా ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్ గా రాజుగారి గది 2 ఫ్యామిలీతో కలసి చూడొచ్చు.

రేటింగ్. 3/5

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here