Telugu Gateway
Politics

పొత్తు బీజేపీ తో...ప్రకటనలు బిఆర్ఎస్ కోసం

పొత్తు బీజేపీ తో...ప్రకటనలు  బిఆర్ఎస్ కోసం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు లు కాంగ్రెస్ జపం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు అసలు కాంగ్రెస్ ఊసు ఎత్తని వీళ్లు ఇప్పుడు కాంగ్రెస్ పై తప్ప బీజేపీ పై పెద్దగా విమర్శలు కూడా చేయటం లేదు. వీళ్లకు తోడుగా ఇప్పుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ సెక్యూలర్ ప్రెసిడెంట్ కుమార స్వామి కూడా రంగంలోకి దిగారు. కెసిఆర్, కుమార స్వామి మంచి స్నేహితులే. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చుతూ ప్రకటన చేసే సమయంలో వచ్చిన అతి తక్కువ మందిలో కుమార స్వామి కూడా ఒకరు. జాతీయ పార్టీగా మారినందున తాము కర్ణాటకలో కలిసి పోటీ చేస్తామని కెసిఆర్ ప్రకటించారు కూడా. కర్ణాటక ఎన్నికలు వచ్చాయి...పోయాయి..కానీ కెసిఆర్ కర్ణాటక వైపు చూడలేదు...కెసిఆర్ జేడిఎస్ కు చేస్తామన్న ఆర్థిక సాయం కూడా చేయలేదు అన్నట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. తాజగా ముగిసిన ఎన్నికల్లో జేడిఎస్ ఆశించిన ఫలితాలను సాధించలేదు కూడా. సీన్ కట్ చేస్తే లోక్ సభ ఎన్నికల కోసం ఆ పార్టీ బీజేపీ తో జట్టు కట్టడానికి రెడీ అయిపోయింది. బీజేపీ అగ్రనేతలు,,జేడిఎస్ మధ్య డీల్ కూడా కూడా పూర్తి అయినట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు విచిత్రంగా జేడిఎస్ నేత కుమార స్వామి ఆదివారం నాడు మీడియా సమావేశం పెట్టి మరీ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలను నమ్మవద్దు అని ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది అని విమర్శించారు. అదే సమయంలో తెలంగాణాలో బిఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ తమ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి జేడీఎస్ ఆ పార్టీని విమర్శించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఒక వైపు బీజేపీ తో పొత్తుపెట్టుకుని తెలంగాణాలో ఆ పార్టీ కూడా బరిలో ఉన్నా కూడా దాని గురించి ఏ మాత్రం ప్రస్తావించకుండా కాంగ్రెస్ ను తిట్టడం..బిఆర్ఎస్ ను పొగడటం ఆసక్తికర పరిణామంగా మారింది. తెలంగాణా కాంగ్రెస్ తో పాటు , ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లాంటి వారు కూడా ఇప్పటికే బిఆర్ఎస్ , బీజేపీ లు ఒకటే అని ప్రచారం చేస్తున్నారు. ఇందుకు పలు ఉదాహరణలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ తరుణంలో కుమార స్వామి ప్రకటన చూసిన వాళ్ళు ఎంత వద్దు అనుకున్నా పొలిటికల్ లింకు లు ఏదో ఒక రూపంలో బయటపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కుమార స్వామి చేసిన తాజా ప్రకటన తో బిఆర్ఎస్, బీజేపీ లు ఒకటే అని..లేక పోతే బీజేపీ తో పొత్తు పెట్టుకున్న జేడిఎస్ తెలంగాణ లో బీజేపీ కి అనుకూలంగా కాకుండా..బిఆర్ఎస్ కు మద్దదుగా ఎందుకు మాట్లాడుతుంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it