Home Andhra Pradesh చంద్రబాబుతో గవర్నర్ భేటీ

చంద్రబాబుతో గవర్నర్ భేటీ

మామూలుగా అయితే గవర్నర్ నరసింహన్ తో చంద్రబాబు భేటీ అని రాయాలి. కానీ ఇక్కడ జరిగింది ఇదే మరి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో గవర్నర్ నరసింహన్ సమావేశం అయ్యారు. విజయవాడలో ఈ భేటీ జరిగింది. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్ రాజ్యాంగాధిపతి. అందుకే ఆయన వద్దకే సీఎం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ సీన్ రివర్స్ అయింది. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నరసింహన్ రంగంలోకి దిగారు. ఇటీవల తలెత్తిన హైకోర్టు విభజన అంశంతో పాటు..నీటి సమస్య ఇలా ఎన్నో అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలన్నిటికీ ఒకేసారి పరిష్కారం అన్వేషిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. తనను కలుసుకొనేందుకు బుధవారం విజయవాడ వచ్చిన గవర్నర్‌తో చంద్రబాబు తన నివాసంలో సుమారు 2 గంటలపాటు భేటీ అయ్యారు. వీరి నడుమ హైకోర్టు విభజన అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

హైకోర్టు విభజనకు ఏపీ సీఎంని ఒప్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల గవర్నర్‌ను కలిసి కోరారు. అదే సమయంలో కేంద్రం కూడా హైకోర్టు సమస్యకు పరిష్కారాన్ని చూడాలని గవర్నర్‌ను కోరింది. ఈ నేపథ్యంలో నరసింహన్‌ విజయవాడ వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలు, తెలంగాణ ప్రభుత్వ వాదన, కేంద్ర వైఖరి తదితర అంశాలను గవర్నర్‌ ఆయనకు వివరించారు. దీనిపై తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు గవర్నర్‌కు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఆసక్తి ఉన్న సమస్య మాత్రమే పరిష్కరించాలని కోరడంతో అసలు సమస్య వస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. 9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థల మధ్య ఆస్తులు, అప్పుల విభజన ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ సంస్థలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరస్పరం స్తంభింప చేసుకొనేంత వరకు వివాదాలు నడుస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. మేము ఎన్ని సార్లు కోరినా దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. అయితే షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజన ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తయిన తర్వాతే హైకోర్టు విభజనకు అంగీకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here