Home Andhra Pradesh బిజెపి..టీడీపీ పొత్తుకు బీటలు!

బిజెపి..టీడీపీ పొత్తుకు బీటలు!

modi, babu

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ బిజెపి టీడీపీకి దూరం జరుగుతుందా?. పొత్తు ఈ టర్మ్ కేనా?. బిజెపి నుంచి ఆ మేరకు స్పష్టమైన సంకేతాలు అందిన తర్వాతే టీడీపీ బిజెపిపై ఆ స్థాయిలో  విమర్శల దూకుడు పెంచిందా?. అంటే అవునంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలుగుదేశం పార్టీలోని కొంత మంది నాయకులకు కూడా ఈ పరిణామాలు ఒకింత ఆశ్చర్యంగానే ఉన్నాయి. ఇటీవల ఏపీకి చెందిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలసిన వెంటనే టీడీపీ నేతలు సాక్ష్యాత్తూ ప్రధాని మోడీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు మోడీ ఆర్థిక నేరగాడు అయిన జగన్ కు అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారని..మంత్రులు మొదలుకుని టీడీపీ నేతలు విలేకరుల సమావేశాలు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. దీనిపై బిజెపిపై కూడా అంతే ధీటుగా స్పందించింది. ప్రధాని మోడీ ఎవరిని కలవాలో…టీడీపీ డిసైడ్ చేయలేదని ఆ పార్టీ నాయకులు ప్రకటించినా..టీడీపీ నేతలు మాత్రం తమ విమర్శల దాడిని ఏ మాత్రం తగ్గించటంలేదు.

                              జగన్ ను మోడీ కలవటం ముమ్మాటికి తప్పే అని టీడీపీ నేతలు శనివారం నాడు కూడా ప్రకటించారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, బిజెపి పొత్తు చెల్లాచెదురు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.                                శనివారం వెలగపూడిలో మీడియాతో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ప్రధానిని కలవటం ద్వారా జగన్ ఏమి సాధించారని ప్రశ్నించటం విశేషం. ఇవన్నీ చూస్తుంటే మాత్రం  లోపలలోపల ఏదో జరుగుతుందని టీడీపీ నేతలు కూడా అనుమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలసి రాష్ట్రపతి అభ్యర్థికి భేషరతుగా మద్దతు పలికినందున ఆయనకకు మద్దతుగా ఉన్న క్రిస్టియన్లు..ముస్లిం మైనారిటీలు దూరం అవుతారని టీడీపీ కొత్తగా ఓ లాజిక్ ను తెరపైకి తెచ్చింది. అదే నిజం అనుకుందాం కాసేపు…ఇఫ్పటికే బిజెపితో భాగస్వామిగా ఉన్న టీడీపీ వైపు వాళ్ళు వస్తారా?. . అంటే కేవలం జగన్ బిజెపితో జత కడితే టీడీపీ బిజెపికి దూరం జరుగుతుంది తప్ప..ఎక్కడా సైద్ధాంతిక అంశాలు ఉండవు అక్కడ.

                          అయితే అదే సమయంలో జగన్ ప్రత్యేక హోదా విషయంలో రాజీపడి..ఏదైనా కారణాలతో గతంలో ప్రకటించినట్లు ఎంపీలతో రాజీనామా చేయించకపోతే మాత్రం చంద్రబాబు..జగన్ కు పెద్ద తేడా లేదని ప్రజలు  భావించే అవకాశం ఉంటుంది. చూస్తుంటే ఏపీలో రాజకీయాలు అనుకున్న దానికంటే వేగంగా మారుతున్నట్లు కన్పిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే ఏపీకి ప్రయోజనం ఉంటుందని ఇంత కాలం చెబుతూ వచ్చిన నేతలు ఏకంగా ప్రధాని మోడీ చర్యలనే ప్రశ్నించటం ద్వారా టీడీపీ పెద్ద ఛాలెంజ్ కే రెడీ అవుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత దేశంలో మోడీ,,అమిత్ షాలకు తిరుగులేని పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here