Home Telangana అవినీతి ఆరోపణలతో కెసీఆర్ సర్కారు ఉక్కిరిబిక్కిరి!

అవినీతి ఆరోపణలతో కెసీఆర్ సర్కారు ఉక్కిరిబిక్కిరి!

KCR

‘ప్రూవ్ ఆర్ పెరిష్. నిరూపించు లేదా శిక్ష అనుభవించు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం’ ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పలుమార్లు చేసిన ప్రకటన. కానీ ఇప్పుడు విపక్షాలకు చెందిన నాయకులు ఏకంగా సవాళ్ళు విసురుతున్నారు. సర్కారు అవినీతిని నిరూపిస్తాం.. చేతనైతే కేసులు పెట్టుకోండి. మేం చెప్పేది అబద్దం అయితే.. జైలులో పెట్టండి అని. అయినా ప్రభుత్వం మాత్రం ఆరోఫణలు చేసిన వారిపై ఎదురుదాడితో సరిపెడుతుందే తప్ప…కెసీఆర్ ముందు ప్రకటించినట్లుగా కేసులు పెట్టే సాహసం చేయలేకపోతుంది. విపక్ష నాయకులు అయితే తాము చేసిన అవినీతి ఆరోపణలపై కేసులు పెట్టాలని ఛాలెంజ్ లు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏకంగా కెసీఆర్ ఫ్యామిలీపైనే తీవ్ర విమర్శలు చేశారు. చేప పిల్లల కుంభకోణంలో కెసీఆర్ ఫ్యామిలీ 300 కోట్ల రూపాయాలు అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు.

                             తనపై కేసు పెట్టాలని కూడా కోమటిరెడ్డి సవాల్ విసిరారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం. మరో వైపు బిజెపి సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి కూడా కెసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక్క పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లోనే 2400 కోట్ల రూపాయల స్కాం జరిగిందని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఏకంగా ముఖ్యమంత్రి కెసీఆర్ భాగస్వామి అయ్యారని నాగం ఆరోపించారు. చేతనైతే ఈ ఆరోపణలకు సంబంధించి తనపై చర్యలు తీసుకోవాలని..తాను ఈ కేసును వదిలిపెట్టబోనని నాగం జనార్థన్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో విత్తన కంపెనీలకు కెసీఆర్ సర్కారు మేలు చేసి పెడుతూ..రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

                                  నకిలీ విత్తనాలు అరికట్టకుండా కొన్ని కంపెనీలతో కెసీఆర్ సర్కారు కుమ్మక్కు అయిందని ఆయన ఆరోపించారు. వాటర్ గ్రిడ్ మొదలుకుని.. మిషన్ కాకతీయ పథకంపై కూలు పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ సీఎం కెసీఆర్ బహిరంగంగా చేసిన ‘ప్రూవ్ ఆర్ పెరిష్’ వ్యాఖ్యలు మాత్రం అమలు కావటం లేదంటే అవినీతిని అంగీకరిస్తున్నట్లేనా?. దీని కోసం ఏకంగా చట్టం కూడా తెస్తానని కెసీఆర్ ప్రకటించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. కెసీఆర్ నిర్ణయంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here