Home Telangana కోట్లు ఉన్నా..కష్టం తెలియాలని

కోట్లు ఉన్నా..కష్టం తెలియాలని

Hirath dolakia

ఉద్యోగం చేసేవాడి కష్టసుఖాలు తెలియాలంటే కొన్ని రోజులు ఉద్యోగం చేయాలి. కారు నడిపేవాడి కష్టం తెలియాలంటే కొంత కాలం నడిపిచూడాలి. చాలా మంది వాడికేం హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటారు. మరికొంత మంది ఏమో..కారు నడపటం ఏముంది హాయిగా..ఏసీలో కూర్చుని కాస్త జాగ్రత్తగా ఉంటే పోలా అంటారు. ఓకే. అది చూసేవాళ్ళకు మాత్రమే. చేసేవాడికే  ఏ కష్టమైనా తెలుస్తుంది. బయటి ఉండి ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. కానీ కోట్ల రూపాయలు ఉన్నా..తన ఉద్యోగులకు కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో పంచిపెట్టే మంచి గుణం ఉన్న ఆయన తన కొడుకు ప్రాక్టికల్ అనుభవం తప్పనిసరి అని భావించాడు. అదే పనిచేశాడు. తన కొడుకు తన హోదా..ఆస్తి వివరాలు ఏమీ బయటకు చెప్పకుండా ఓ నెల రోజులు ఉద్యోగం చేయమన్నారు. ఇదేదో సినిమాటిక్ గా ఉన్నా కూడా నిజంగా నిజం. ఇది జరిగింది హైదరాబాద్ లో నే. అలా చేసింది ఎవరో తెలుసా?. హితార్థ్‌ ధోలాకియా… వయస్సు 23 సంవత్సరాలు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బడా వజ్రాల వ్యాపారి. ‘హరికృష్ణా ఎక్స్‌ పోర్ట్స్‌’అధినేత ఘన్‌శ్యామ్‌ ధోలాకియా కుమారుడే ఇతగాడు.  అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని ఇటీవలే సూరత్‌కి తిరిగొచ్చాడు.

                                వ్యాపార రంగంలోకి దిగుతామని రెడీ అవుతున్న ఆయనకు తండ్రి  ఓ సవాలు విసిరాడు. తానెవరో ఎవరికీ చెప్పకుండా నెలరోజుల పాటు అతి సాధారణ జీవితం గడపాలని, సొంతగా సంపాదించి చూపాలని తండ్రి ఆదేశించాడు. గుర్తింపు కార్డులు, మొబైల్‌ఫోన్‌ లేకుండా కేవలం 500 రూపాయలతో హితార్థ్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.
తనకు ఏమాత్రం సంబంధం లేని హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకున్న హితార్థ్‌ జూలై తొలివారంలో నగరంలో విమానం దిగిన వెంటనే ఉద్యోగ వేటలో పడ్డాడు. పలు దుకాణాలు, చిరు కంపెనీలను ఉద్యోగం కోసం సంప్రదించాడు. అడుగుపెట్టిన ప్రతీచోటా తన చిరునామా, గుర్తింపు కార్డు, ఫోన్‌ నంబర్, ఆధార్‌కార్డు సహా అన్ని వివరాలు అడిగారు. చివరకు తన వివరాలు వారంలో ఇస్తానని చెప్పి మెక్‌డోనాల్డ్స్‌ ఫుడ్‌కోర్ట్, ఆడిదాస్‌ షోరూం, చిల్లీస్‌ రెస్టారెంట్‌ సహా సికింద్రాబాద్‌లోని కార్డుబోర్డ్‌ షాపుల్లో దినసరి కార్మికునిగా నెలరోజుల పాటు బతుకుపోరాటం చేసి సంపాదించాడు.

                                      ఆ వచ్చిన దాంతోనే సర్దుకున్నాడు. కొంత కాలం క్రితం హితార్థ్‌ పినతండ్రి కూడా ఇదే తరహాలో తన కుమారుడిని సామాన్యుడిలా బతకాలని చెప్పి కేరళకు పంపాడు. ఇక హితార్థ్‌ తండ్రి ఘన్‌శ్యామ్‌ కూడా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీపావళి కానుకగా 1200 కార్లు, ఖరీదైన ఫ్లాట్లు బహుమతులుగా ఇచ్చి వార్తల్లోకెక్కిన విషయం విదితమే. ఈ వివరాలన్నింటినీ శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌దక్కన్‌ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హితార్థ్‌ చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఈ సమావేశంలో అతడి పినతండ్రి, వారి కుటుంబ స్నేహితుడు, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌త్రివేది పాల్గొన్నారు. అమ్మాయిలను తప్ప..ఇలా వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇలా కష్టసుఖాలు తెలుసుకోవటం తప్పనిసరి. ఏది ఏమైనా ఈ కాన్సెప్ట్ సూపర్ గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here