Home Andhra Pradesh సర్కారును సర్కారే మోసం చేస్తోంది!

సర్కారును సర్కారే మోసం చేస్తోంది!

అదెలా సాధ్యం అవుతుంది అంటారా?. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే సాధ్యం కావచ్చనుకుంటా. రెండు ప్రభుత్వ శాఖల మధ్య సాగిన ఈ తంతు చూసిన అధికార వర్గాలు అవాక్కవుతున్నాయి. అదెలాగో మీరే చూడండి. ఏపీ సాగునీటి శాఖ కృష్ణా జిల్లాలో పుష్కరాల పనులు చేపట్టింది. వంద కోట్ల రూపాయల పైబడిన పనులను తొలిసారి నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్లు పిలిచి అస్మదీయ సంస్థలకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం వందల కోట్ల రూపాయల పనులను ఇలా అనుమతించరు. కానీ అదేమి పట్టించుకోని సాగునీటి శాఖ కొటేషన్లతో నచ్చిన వారికి నామినేషన్ పై పనులు అప్పగించింది. పనులు కూడా ప్రారంభం అయ్యాయి. కాంట్రాక్టర్లు పనులు కూడా ప్రారంభించారు. ఏకంగా 35 కోట్ల రూపాయల పని కూడా పూర్తి చేశారు. ఆర్ధిక శాఖ ఏ పనికైనా బిల్లులు ఇవ్వాలంటే దానికి పరిపాలనా అనుమతి ఉండాలి. కానీ  ఈ పనులకు అలాంటిది ఏమీ లేదు. కంపెనీలు బిల్లు పెట్టాయి. కానీ అధికారులు పక్కన పెట్టేశారు.

తాజాగా పుష్కరాల సమీక్ష నిర్వహించిన చంద్రబాబునాయుడు అధికారులపై మండిపడ్డారు. ఒకరిద్దరిని సస్పెండ్ చేస్తే తప్ప దారికి రారు..అంటూ నిప్పులు చెరిగారు. ఎవరికీ విషయం అర్థం కాలేదు.. అంతగా సీరియస్ అయ్యే అంశంఏమీ లేదుగా అని ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏమిటో తర్వాత తెలిసింది. పారదర్శకతకే కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే సాగునీటి శాఖ అధికారులు పనులు అప్పగించిన తర్వాత తాపీగా ఆర్థిక శాఖకు ఫైలు పంపారు. కొటేషన్లపై పనులు అప్పగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. పనులు మొదలైన విషయాన్ని అసలు అందులో ఏ మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఆర్థిక శాఖ అధికారులు పనుల మొత్తం చాలా విలువతో కూడుకున్నది కావటంతో ఎప్పటిలాగే పద్దతి ఫాలో అయి…నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలని రాశారు. అంటే సాగునీటి శాఖ పనులు ప్రారంభించి కూడా ఆ విషయాన్ని ఆర్థిక శాఖ దగ్గర దాచేసింది. ఇలా సర్కారును సర్కారే మోసం చేయటం గ్రేట్ అంటూ అధికారులు అవాక్కవుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here