Telugu Gateway
Top Stories

మరో కీలక వ్యాక్సిన్ కు మధ్యలోనే బ్రేక్

కొద్ది రోజుల క్రితం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పరీక్షలకు మధ్యలోనే బ్రేక్ పడింది. దీనికి కారణం వ్యాక్సిన్ డోసు ఇచ్చిన ఓ వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తటమే. దీంతో కొంత కాలం పాటు ప్రయోగాలు ఆపేశారు. తర్వాత ఫలితాలను సమీక్షించి..మళ్లీ ప్రయోగాలు ప్రారంభించారు. అలాంటిదే ఇప్పుడు మరో కంపెనీకి ఎదురైంది. ప్రముఖ సంస్థ జాన్సన్అండ్ జాన్సన్ (జెఅండ్ జె) కు కూడా అదే తరహా సమస్య ఎదురైంది. వ్యాక్సిన్‌ ప్రయోగించిన వాలంటీర్లలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పరీక్షలను నిలిపివేసింది. తాము నిర్వహించిన అథ్యయన పరీక్షలో పాల్గొన్న ఓ వ్యక్తి వివరించలేని అస్వస్థతకు లోనవడంతో తమ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై మూడవ దశ పరీక్షలు సహా అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ ను తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

దీంతో 60,000 మందిని క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ వ్యవస్థను మూసివేశారు. మరోవైపు రోగుల భద్రతా కమిటి భేటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఏ క్లినికల్‌ ట్రయల్స్‌లో అయినా ముఖ్యంగా భారీ అథ్యయనాల్లో తీవ్ర ప్రతికూల ఘటన(ఎస్‌ఏఈ)లు ఊహించదగినవేనని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పేర్కొంది. అథ్యయనాన్ని నిలిపివేసి ఎస్‌ఏఈకి కారణం ఏమిటనేది పరిశీలించి వ్యాక్సిన్‌ మానవ పరీక్షలను పునరుద్ధరిస్తామని తెలిపింది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల్లో 60,000 మంది వాలంటీర్లపై భారీగా మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సెప్టెంబర్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది.

Next Story
Share it