Telugu Gateway
Telangana

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ
X

హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులకు నిరసన సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. కనీస అవసరాలు కూడా అందక నానా కష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు సాయం చేస్తామని ప్రకటించినా ఇవి వారికి అందటంలో కొన్ని చోట్ల విపరీతమైన జాప్యం జరుగుతోంది. సాయం అందని ప్రాంతాల్లో బాధితులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. ఆదివారం నాడు వరద ప్రభావిత ప్రాంతాలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డిలపై బాదితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్‌ పరిధిలోని మిధిలాపూర్‌ కాలనీలో జరిగింది.

వరద బాధితుల వద్దకు వెళ్లిన మంత్రిని స్థానికులు అడ్డుకున్నారు. గత వారం రోజులుగా వర్షాలు, వరదలు వస్తున్నా తమను ఎవరూ పట్టించుకోవడంలేదని వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కాన్వాయ్‌కు అడ్డుగా రోడ్డుపై భైఠాయించి కాసేపు నిరసన తెలిపారు. పోలీసులు భారీగా చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తంగా మారింది. దీంతో వాహనం దిగి స్థానికుల వద్దకు వచ్చిన సబిత.. ఎంపీ రంజిత్ రెడ్డిలు బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా నిత్యవసర వస్తువులతో పాటు ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Next Story
Share it