Home Andhra Pradesh అమరావతిలో కళ్లు చెదిరేలా కన్వెన్షన్ సెంటర్

అమరావతిలో కళ్లు చెదిరేలా కన్వెన్షన్ సెంటర్

అమరావతిలో చేపడుతున్న ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను దేశంలోనే అతి పెద్ద సమావేశ మందిరంగా వుండేలా నిర్మించడానికి డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు అంగీకరించింది. అలాగే, తాము తలపెట్టిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను జర్మనీలోని హనోవర్ ఫెయిర్‌కు దీటుగా వుండేలా తీర్చిదిద్దేందుకు ఈ గ్రూపు సంసిద్ధమైంది. అంతేకాకుండా, అమరావతిలో ఏర్పాటుచేస్తున్న అమ్యూజ్‌మెంటు పార్కు కోసం అత్యుత్తమ ఆకృతులను అందించేందుకు ఈ రంగంలో పేర్గాంచిన వరల్డ్ క్లాస్ డిజైనర్లను తీసుకొస్తామని డాక్టర్ షెట్టీ ముఖ్యమంత్రికి మాటిచ్చారని సీఎం కార్యాలయం వెల్లడించింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో రూ.12 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకొచ్చిన అబుదాబీకి చెందిన ఈ వాణిజ్య దిగ్గజం గత మే 2న జరిగిన  అవగాహన ఒప్పందం పురోగతిపై సమీక్షించేందుకు రాష్ట్రానికి వచ్చింది. సోమవారం రాత్రి బాగా పొద్దుపోయాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో తన కుటుంబంతో సహా కలిసిన డాక్టర్ షెట్టీ ఈ ప్రాజెక్టులపై చర్చించారు. ఏదో సాధారణ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలని తాము కోరుకోవడం లేదని, ప్రపంచశ్రేణి నగరంగా నిర్మాణాన్ని  జరుపుకోబోతున్న అమరావతికి మరింత వన్నెతెచ్చే సమావేశ మందిరం వుండాలని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డాక్టర్ షెట్టీకి తన అభిప్రాయాన్ని చెప్పారు.

అమరావతి కన్వెన్షన్ సెంటర్‌, ఐదు నక్షత్రాల హోటల్‌, ఎగ్జిబిషన్ సెంటర్‌లను ముఖ్యమంత్రి ఆశిస్తున్న మేరకు అంతర్జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా నిర్మించగలమని ఎన్ఎంసీ గ్రూపుకు సారధ్యం వహిస్తున్న పద్మశ్రీ బీఆర్ షెట్టీ చెప్పారు. ఒకేసారి 10 వేలమంది కూర్చునే సామర్ధ్యంతో ఈ ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్‌ను నెలకొల్పుతున్నామని, అంతర్జాతీయ పర్యటకుల్ని ఆకర్షించే స్థాయిలో ఐదు నక్షత్రాల హోటల్‌ను ఏర్పాటుచేస్తామని వివరించారు. అలాగే, ఎన్నో అంతర్జాతీయ ప్రదర్శనలకు మున్ముందు వేదికగా నిలిచే భారీ ప్రదర్శనశాలను నెలకొల్పుతామని అన్నారు. రాష్ట్రంలో అమరావతి సహా పలు ప్రాంతాల్లో పచ్చదనం పరిఢవిల్లే పర్యావరణ హితమైన గృహ సముదాయాల నిర్మాణానికి ఎన్ఎంసీ గ్రూపు ఉపక్రమించినట్టు డాక్టర్ షెట్టీ చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టులన్నీ 2018 నాటికల్లా పూర్తిచేయడానికి సిద్ధంగా వున్నామని డాక్టర్ బీఆర్ షెట్టీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రపంచం మెచ్చే మేటి నగరంగా నిర్మాణం జరుపుకోబోతున్న అమరావతికి అంతర్జాతీయ హోదా, హంగు కల్పించేందుకు దోహదపడే వరల్డ్ క్లాస్ గోల్ఫ్ కోర్స్‌ను షెట్టీ గ్రూపు ఏర్పాటుచేస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here