Home Andhra Pradesh బాబు ‘బిజినెస్ మోడల్’ ఇది

బాబు ‘బిజినెస్ మోడల్’ ఇది

అంతా మేం చేస్తాం..మీరు అమ్ముకోండి

తవ్వేకొద్దీ అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘అక్రమాల’ బిజినెస్ మోడల్ వెలుగులోకి వస్తోంది. ఇదంతా చూస్తున్న వారు  ఒక్క చంద్రబాబునాయుడు తప్ప..మరెవరూ చేయలేరని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్న సర్కారు ‘ఫక్తు’ రియల్ ఎస్టేట్ దందాకు శ్రీకారం చుట్టింది. ఈ ఒప్పందంలోని అంశాలు ఎంత దారుణం అంటే అంత దారుణంగా  ఉన్నాయి. ఇప్పటి వరకూ చూసింది 1691 ఎకరాలు అప్పగించి..5500 కోట్ల రూపాయల మౌలికసదుపాయాలు కల్పించాలని. అందులో సింగపూర్ కంపెనీలు భారీ భవంతులు కట్టి అమ్మేసుకుని వచ్చే ఆదాయంలో 52 శాతం వాటా తీసుకుని భూమి ఇచ్చిన..మౌలికసదుపాయాలు కల్పించిన సర్కారుకు మాత్రం 48 శాతం ఇస్తాయి. పోనీ  ఆ కంపెనీలు ఏమైనా పెట్టుబడి పెడతాయా? అంటే అదీ నామమాత్రమే.

మిగతా అంతా ప్రభుత్వం నుంచి భూమిని తనఖా పెట్టి రుణంగా తెచ్చుకుంటాయి. అంతే కాదు ఇంకా ఎన్నో రాయితీలు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే స్టార్టప్ ఏరియా కింద అభివృద్ధి చేయ ప్రతిపాదించిన ప్రాంతంలో సింగపూర్ కంపెనీలు ‘థర్డ్ పార్టీల’కు ఫ్లాట్లు కూడా అమ్ముకోవచ్చట. అంటే సింగపూర్ కంపెనీలు ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని..సర్కారుతో మౌలికసదుపాయాలు ఏర్పాటు చేయించుకుని వాటిని వేరే వాళ్ళకు అమ్మేస్తారట. దీనికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు.

ఈ భూమి అమ్మకంలో కూడా గోల్ మాల్ ఉన్నట్లు కన్పిస్తుంది. తొలి దశ ప్రాజెక్టులో ప్లాట్లను తొలి దశ ప్రతిపాదనలో పేర్కొన్న కనీస ధరకే అమ్మేస్తారట. ఎవరైనా మార్కెట్ డిమాండ్ ను బట్టి ధర నిర్ణయిస్తారు కానీ..ఇక్కడ మాత్రం కనీస ధరకే విక్రయిచాంలని పేర్కొనటం విశేషం. ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన థర్డ్ పార్టీలు మాత్రం ఆమోదిత మాస్టర్  ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఇలాంటి కుంభకోణాలు ఎన్ని వెలుగులోకి వస్తాయో చూడాల్సిందే. కనీస ధర పేరుతో ఎంపిక చేసిన కంపెనీలకు భూములు కట్టబెట్టుకునే వెసులుబాటు ఉంచుకున్నారు. ఇదంతా చూస్తుంటే స్టార్టప్ ఏరియా ప్రాంతం అంతా వారి గుప్పిట్లోనే ఉండబోతుందనే విషయం తేటతెల్లం అవుతోంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here