అమ్మ...అజయ్ జైన్!
ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో ఓ వెలుగు వెలిగిన ఉన్నతాధికారి ఆయన. ఒకటి కాదు..రెండు కాదు..అత్యంత కీలకమైన పదవులు అన్నీ ఆయనకే. విద్యుత్, మౌలికసదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ తో పాటు అత్యంత కీలకమైన రాజధాని వ్యవహారాలతో కూడిన ఏపీసీఆర్ డీఏ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు. వాస్తవానికి మునిసిపల్, పరిపాలన శాఖలో ఉండాల్సిన సీఆర్ డీఏను విడగొట్టి.. ఈ బాధ్యతలు అజయ్ జైన్ కు అప్పగించారు. ఈ శాఖలు అన్నీ చంద్రబాబు పాలనలో ‘స్కాంలకు కేంద్రాలుగా’ మారిన సంగతి తెలిసిందే. అయితే విద్యుత్ శాఖకు సంబంధించిన ఓ అంశంపై అజయ్ జైన్ అక్రమాలకు పాల్పడిన వారిని రక్షించేందుకు పడిన పాట్లు ఇప్పుడు ఆ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇందులో అజయ్ జైన్ కూడా భాగస్వామి అయ్యారా?. లేక ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఆయన ఈ కుంభకోణం పాత్రదారులకు రక్షణగా నిలబడ్డారా? అన్న అంశం విద్యుత్ శాఖ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఓ వైపు సీఆర్ డీఏలో అడ్డగోలుగా అక్రమాలు సాగుతున్నా ఆయన ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) కోసం కొనుగోలు చేసిన కవర్ కండక్టర్ల కొనుగోలులో భారీ గోల్ మాల్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఏకంగా 119 కోట్ల రూపాయల మేర స్కాం జరిగినట్లు ట్రాన్స్ కో విజిలెన్స్ ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ కు నివేదిక అందజేసింది. ఈ కుంభకోణం పెద్ద దుమారమే రేపింది. కవర్ కండక్టర్ల వ్యవహారంలో కుంభకోణానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలతో విజిలెన్స్ నివేదికను అజయ్ జైన్ కు ఇఛ్చినా ఆయన తన దగ్గర దీన్ని ఏకంగా ఆరు నెలల పాటు తొక్కిపెట్టడమే ఇప్పుడు ఆయనపై అనుమానాలు పెంచేలా చేస్తున్నాయి. నిజంగా ఆయన పాత్ర ఏమీ లేకపోతే ఎందుకు సత్వరమే చర్యలకు ఉపక్రమించకుండా ఆరు నెలల పాటు నివేదికను తొక్కిపెట్టారు. ఎప్పుడు అయితే ఈ వ్యవహారం హైకోర్టుకు చేరిందో ఆ వెంటనే ఆగమేఘాల మీద ఎందుకు స్పందించాల్సి వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 6న అజయ్ జైన్ జారీ చేసిన మెమోలో ‘అత్యవసరం’ అంటూ ఆగమేఘాల మీద బాధ్యులపై చర్యలకు ఆదేశాలు జారీ చేయటం వెనక మతలబు ఏమిటి?.
విజిలెన్స్ నివేదిక అజయ్ జైన్ కు 14.06.2018 లో అందితే...అందులోని తీవ్రత చూసి వెంటనే చర్యలకు ఉపక్రమించాల్సిన ఆయన ఎందుకు ఆరు నెలలు దీన్ని తొక్కిపెట్టారు. ఎప్పుడు అయితే ఈ వ్యవహారం హైకోర్టు గడప తొక్కిందో అప్పుడు హడావుడిగా ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్న దొరతో తన పదవికి రాజీనామా చేయించారని చెబుతున్నారు. విచారణ జరిపిన తీరుపైనా విద్యుత్ శాఖలోనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విజిలెన్స్ అధికారులు నివేదికను నేరుగా ఆయనకే సమర్పించారు. అందులో పలు కీలక ఉల్లంఘనలను ప్రస్తావించారు. అయినా సరే ఆయన ఆరు నెలలు కాలం గడిపి..తర్వాత మాత్రం ‘అత్యవసరం’ అంటూ హంగామా చేయటం వెనక మతలబు ఏమిటి?. విజిలెన్స్ నివేదికలో కవర్డ్ కండక్టర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలను కళ్ళకుకట్టినట్లు నివేదిక సమర్పించింది.
అందులోని ముఖ్యాంశాలు కొన్ని... కవర్డ్ కండక్టర్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలవకుండా స్థానికంగా సేకరణకే ప్రాధాన్యత ఇచ్చారు. అసలు భారత్ లో దీనికి సంబంధించిన మెటీరియలే లేదు. అసలు టెండర్ పిలిచే ముందుకు ఏపీఎస్ పీడీసీఎల్ క్షేత్రస్థాయిలో కనీస కసరత్తు కూడా చేయలేదు. కొత్తదైన ఈ స్పెషలైజ్డ్ ఐటెం ధర ఎంత ఉంటుందని కూడా చూడలేదు. అన్ని టెండర్లు ఒక్క భారతీయ ఏజెంట్ కే అప్పగించారు. సరఫరా చేసే మెటీరియల్, స్పెసిఫికేషన్స్, పనితీరు గ్యారంటీ వంటి అంశాలపై ఎలాంటి హామీ లేకుండా అతనికి కట్టబెట్టారు. రేకెమ్ ఆర్ పీజీ ప్రైవేట్ లిమిటెడ్, సాయి ఎలక్ట్రికల్ ఎంటర్ ప్రైజెస్, ఫ్రంట్ లైన్ ఎలక్ట్రికల్స్, బెంగుళూరు సంస్థలు అన్ని టెండర్లలో పాల్గొన్నాయి. రేకెమ్ ఆర్ పిజి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒక్కటే అన్ని టెండర్లలోనూ విజయవంతమైన బిడ్డర్ గా నిలిచింది.
ఏపీఎస్ పీడీసీఎల్ దగ్గర వెండర్ రిజిస్ట్రేషన్ లేకుండానే పనులు దక్కించుకుంది. ఎలక్ట్రికల్ పనులు చేపట్టేందుకు తప్పనిసరిగా ఉండాల్సిన సీఈఐజి లైసెన్స్ కూడా ఈ సంస్థకు లేదు. బెంగుళూరుకు చెందిన రేకెమ్ ఆర్ పీజీ ప్రైవేట్ లిమిటెడ్ కు పదే పదే ఆర్డర్లు ఇస్తూ ఆ సంస్థ నుంచే 3414 కెఎం కవర్డ్ కండక్టర్ లు కొనుగోలు చేశారు. దీనికి అయిన వ్యయం 178 కోట్ల రూపాయలు. వాస్తవానికి ఈ బిల్లు విలువ 59 కోట్ల రూపాయలు అయితే..178 కోట్ల రూపాయలు చెల్లించేశారు. దీని ద్వారా 119 కోట్ల రూపాయల నష్టానికి కారణం అయ్యారు అధికారులు. అన్ని రకాలుగా కలుపుకుంటే డిస్కంలకు వాటిల్లిన నష్టం 131 కోట్ల రూపాయలుగా తేలింది. అంతే కాదు..కొంత మంది అధికారులు నిబంధనలు ఉల్లంఘించి విదేశీ పర్యటనలు చేసి వచ్చారు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఉల్లంఘనలు ఎన్నో.ఉన్నతాధికారిగా ఉన్న అజయ్ జైన్ సకాలంలో స్పందించకుండా ఎందుకు జాప్యం చేసినట్లు?.