Telugu Gateway
Telangana

కెసీఆర్ తో భేటీకి స్టాలిన్ దూరం!

కెసీఆర్ తో భేటీకి స్టాలిన్ దూరం!
X

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసే గడువు దగ్గరకొస్తుండటంతో దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్రంలో ఏ జాతీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం ఉండదనే అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అయ్యే అవకాశం ఉందని ప్రస్తుత ‘లెక్కలు’ సూచిస్తున్నాయి. అందుకే ఫలితాల వెల్లడి తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఎవరికి వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ ఎప్పటి నుంచో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 13న చెన్నయ్ లో డీఎంకె అధినేత ఎం కె స్టాలిన్ తో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే డీఎంకె వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ భేటీ జరిగే అవకాశం కన్పించటం లేదు. డీఎంకె ఇఫ్పటికే యూపీఏలో భాగస్వామిగా ఉంది. ఎలాగూ ఆ పార్టీ ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గుచూపే అవకాశాలు కన్పించటం లేదు.

ఈ తరుణంలో కెసీఆర్ తో భేటీ ఎందుకు అని స్టాలిన్ సమావేశానికి ఆసక్తి చూపటంలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ భేటీ జరగదంటూనే..దీనికి మాత్రం వేరే కారణాలు చూపుతున్నారు. తమిళనాడులో ఈనెల 19న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ బిజీగా ఉన్నందున కేసీఆర్‌తో సమావేశం కుదరకపోవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. చెన్నయ్ లో ఈ నెల 13న స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అవుతారని తెలంగాణ సీఎంఓ ఇఫ్పటికే ప్రకటించింది. దేశ రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల అనంతరం పరిణామాలు, కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు తదితర అంశాలపై స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చిస్తారని పేర్కొంది.

Next Story
Share it