Telugu Gateway
Telangana

‘లోగోల గోల్ మాల్’ చేసిన రవిప్రకాష్

‘లోగోల గోల్ మాల్’ చేసిన రవిప్రకాష్
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఫోర్జరీ..డేటా చోరీ వంటి కేసుల నమోదు కాగా..తాజాగా వాటాల బదిలీ ఒప్పందం కూడా బోగస్ అని తేలింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మెయిల్స్ ను తనిఖీ చేయటం ద్వారా ఈ విషయాన్ని నిగ్గుతేల్చారు. ఇఫ్పుడు అత్యంత కీలకమైన టీవీ9 లోగోల అమ్మకం వెలుగులోకి వచ్చింది. ఎంతో విలువ ఉన్న టీవీ9 బ్రాండ్ లోగోలను కేవలం లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు మోజో టీవీని ప్రమోట్ చేసిన సంస్థకు విక్రయించటం ద్వారా రవిప్రకాష్ మరో అక్రమానికి పాల్పడ్డారని అలందా మీడియా కేసు పెట్టింది. ఏబీసీఎల్ ప్రైవేట్ లిమిటెడ్‌ తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో న్యూస్ చానళ్లను నిర్వహిస్తోంది. ఇంగ్లీష్ చానల్ న్యూస్ 9 పేరుతో నడుస్తుండగా, మిగిలిన చానళ్లన్నీ టీవీ9 లోగోతోనే కొనసాగుతున్నాయి. ఏ చానల్‌కైనా లోగోనే కీలకం. ఆ లోగో ఆధారంగానే దాని వ్యాపారం, కార్యకలాపాలు కొనసాగుతాయి. మార్కెట్ పరంగా ఎంతో విలువైన టీవీ9లోగోలు కొత్త యాజమాన్యానికి దక్కకుండా కుట్ర పన్నారు. టీవీ9 లోగోలు ఎప్పటికీ తన చేతుల్లోనే ఉండాలన్న దురుద్దేశంతో తన అనుచరుడు, మోజో టీవీ ఎండీ హరికిరణ్ చేరెడ్డికి గ్రూప్‌ చానళ్లలో అత్యంత కీలకమైన మూడు లోగోలను అమ్మేసినట్లు పత్రాలను సృష్టించారు. టీవీ9 కొత్త యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తే, రవిప్రకాశ్‌, ఏబీసీఎల్‌లోని మరో డైరెక్టర్ ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్ చేరెడ్డి కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

టీవీ9 లోగోలకు సంబంధించిన రిజిస్టర్డ్‌ ట్రేడ్‌మార్క్స్‌, కాపీరైట్‌ హక్కులను డిసెంబర్ 31, 2018న మోజో టీవీని నిర్వహిస్తున్న మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు కేవలం రూ.99,000/- కు రవిప్రకాశ్ విక్రయిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. మే 22, 2018న మౌఖికంగా కుదిరిన ఒప్పందం మేరకు లోగోలను విక్రయిస్తున్నామంటూ ఈ పత్రాల్లో పేర్కొన్నారు. లెక్కల్లో చూపడం కోసం మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ. 99వేలను జనవరి 22, 2019న ఏబీసీఎల్‌ అకౌంట్‌లోకి బదలాయించారు. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం రిపేర్లు, నిర్వహణకు అయిన ఖర్చుల రూపేణా అంటూ రికార్డుల్లో ఈ డబ్బును చూపించారు. దీంతో రవిప్రకాష్ కేసు మరో మలుపు తిరిగినట్లు అయింది. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే రవిప్రకాష్ అరెస్టు అనివార్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it