Telugu Gateway
Politics

నా క్షమాపణ మోడీకి...బిజెపికి కాదు

నా క్షమాపణ మోడీకి...బిజెపికి కాదు
X

ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ‘చౌకీ దార్ చోర్ హై’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధాని మోడీకి, బిజెపికి ఎలాంటి క్షమాపణలు చెప్పలేదన్నారు. తన క్షమాపణలు సుప్రీంకోర్టుకు మాత్రమే అని తెలిపారు. అదే సమయంలో చౌకీ దార్ చోర్ హై అన్న తమ నినాదం కొనసాగుతుందని రాహుల్ స్పష్టం చేశారు. ఐదేళ్ళ తన పదవీ కాలంలో ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించకపోవటం సిగ్గుచేటు అన్నారు. యూపీఏ హయాంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ను వీడియో గేమ్స్ తో పోల్చటం ద్వారా మోడీ దేశ సైనిక దళాలను అవమానించారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ శనివారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మోడీ నిర్ణయాలతో చతికిలపడిన దేశ ఆర్థిక రంగం న్యాయ్ తో గాడిన పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాఫెల్ డీల్ కు సంబంధించి బయటకు వచ్చిన పేపర్లు ప్రధాని కార్యాలయం పాత్రను నిరూపించాయని పేర్కొన్నారు.

అవినీతిపై చర్చకు సంబంధించి మోడీకి సమయమే దొరుకుతున్నట్లు లేదని ఎధ్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా నష్టపోయిందని తెలిపారు. యువతకు కల్పిస్తామన్న కోట్లాది ఉద్యోగాల గురించి మోడీ ఎందుకు నోరెత్తటంలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి మోడీ, అమిత్ షా ఏమి మాట్లాడినా అంతా సవ్యంగానే కన్పిస్తుందని..తమకు మాత్రం నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తుందని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సామాన్యుల గళం వంటిదని వ్యాఖ్యానించారు.

Next Story
Share it