Telugu Gateway
Politics

మహానాడు రద్దు సంకేతం ఏంటి?

మహానాడు రద్దు సంకేతం ఏంటి?
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిర్ణయం దేనికి సంకేతం?. మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ అత్యంత కీలకమైన ‘మహానాడు’ను రద్దు చేసుకుంటుందా?. ఫలితాలకు మహానాడుకు ఎక్కువ సమయం లేని మాట వాస్తవమే. కాకపోతే ఒక్క రోజైనా సరే మహానాడు నిర్వహించుకోవచ్చు. అది ప్రస్తుతం ఉన్న అమరావతిలోనే జరపొచ్చు. ఎక్కడ జరపాలి అన్నదానిపై ఎవరికీ పెద్దగా పట్టింపులు ఉండవు కూడా. కానీ మహానాడు రద్దు సంకేతాలు ఇవ్వటం ద్వారా టీడీపీ శ్రేణులకు, ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?. అందునా తెలుగుదేశం ప్రస్తుత అధికార పార్టీ. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. ఒక్కటి కాదు..రెండు కాదు. నాలుగు సర్వేలు..విశ్లేషణలు కూడా అదే చెబుతున్నాయి అని చంద్రబాబు ఢంకా బజాయించి చెబుతున్నారు. మరి అంత ధీమా ఉన్న పార్టీ అత్యంత కీలకమైన వ్యవస్థాపక అధ్యక్షుడి ఎన్టీఆర్ పుట్టిన రోజున జరిపే మహానాడును రద్దు చేసుకుని..జిల్లాల వారీగా..మండలాల వారీగా కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించటంతోనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ఇప్పటికే టీడీపీ గెలుపు అవకాశాలు ఏ మాత్రం లేవనే అంచనాల నడుమ మహానాడు రద్దు నిర్ణయం టీడీపీలో కలకలం రేపుతోంది. దీంతో మరింత క్లారిటీ ఇచ్చేసినట్లు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మహానాడు రద్దు నిర్ణయానికి కేంద్రంలో..రాష్ట్రంలో చంద్రబాబు బిజీగా ఉంటారనే కారణాలు ఏ మాత్రం సహేతుకంగా లేవనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెబుతున్నా..మహానాడు రద్దు సంకేతాలను స్పష్టంగా పంపించేశారు. గెలిచే పార్టీ ఊపుతో మహానాడు ను కుదించి అయినా జరుపుకుంటుంది. కానీ గెలుపు అవకాశాలు లేకపోవటంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it