Telugu Gateway
Politics

చంద్రబాబు కు ‘డబుల్ షాక్’ తప్పదా!

చంద్రబాబు కు ‘డబుల్ షాక్’ తప్పదా!
X

కేంద్రంలో మళ్ళీ మోడీ. ఆంధ్రప్రదేశ్ లో జగన్. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ‘డబుల్ షాక్’ తప్పేలా లేదు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీ నేతలు ఎగ్జిట్ పోల్స్ ను మేం నమ్మం అని చెబుతున్నారు. ఎవరిష్టం వారిది. ఇందులో విభేదించాల్సిన అవసరం కూడా ఏమీలేదు. ఎగ్జిట్ పోల్స్ నమ్మం అనే వారంతా టీడీపీకి అనుకూలంగా ఉన్న లగడపాటితోపాటు మరికొన్నింటిని మాత్రం నమ్ముతాం అంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ కు ముందు నుంచే ఏపీలో వైసీపీ గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అంచనాలు వెలువడ్డాయి. వీటి అన్నింటికి తోడు తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఖచ్చితమైన అంచనాలు వెలువరించిన సంస్థల్లో ఇండియాటుడే-యాక్సిస్, వీడీపీ అసోసియేట్స్, సీపీఎస్ సంస్థలు ఉన్నాయి. ఈ మూడు సంస్థలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా వెలువరించారు. ఇప్పుడు ఇదే మూడు సంస్థలు ఏపీలో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. దీంతో ఏపీలో చంద్రబాబు పాలన ముగిసినట్లే అని అభిప్రాయం గట్టిగా వ్యక్తం అవుతోంది.

వీటితోపాటు టైమ్స్ నౌ-వీఎంఆర్ కూడా వైసీపీకి 18 లోక్ సభ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడి నియంత్రణలో ఉన్న ఐన్యూస్ కూడా ఏపీలో వైసీపీ వంద సీట్లు దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొంది. టీడీపీకి అనుకూలంగా మాజీ ఎంపీ లగడపాటితోపాటు టుడేస్ చాణక్య, రిపబ్లిక్-జన్ కీబాత్, రిపబ్లిక్ సీ ఓటర్ అంచనాలు వెలువరించాయి. టీడీపీ నేతలు ఎక్కువగా నమ్ముతున్న లగడపాటి ఫలితాలు తెలంగాణలో ఏమి అయ్యాయో అందరూ చూసిందే. దీనికి తోడు లగడపాటి ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. సర్వేల నిర్వహణతోపాటు పలు అంశాల్లో ప్రముఖ మీడియా సంస్థతో కలసి తెరవెనక సేవలు అందించారు. ఈ అంశాలు అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే పబ్లిక్ పల్స్ కు..తెలంగాణలో ఖచ్చితమైన ఫలితాలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ కు దగ్గర పోలిక ఉండటంతో ఏపీలో టీడీపీ ఇంటిదారి పట్టడం ఖాయం అన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.

ఇది ఒకెత్తు అయితే కేంద్రంలో మోడీ ఎలాగైనా మరోసారి పదవి చేపట్టకుండా ఉండేందుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నం లేదు. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే దేశంలోని అన్నిఎగ్జిట్ పోల్స్ లోనూ బిజెపికి సొంతంగా వచ్చే సీట్లు కొంత మేర తగ్గినా ఎన్డీయే మాత్రం మెజారిటీకి అవసరమైన దానికంటే ఎక్కువ సీట్లను దక్కించుకునే ఛాన్స్ ఉందని స్పష్టమైన సంకేతాలు పంపాయి. మోడీతో ఘర్షణ విషయంలో చంద్రబాబు అవసరమైన దానికంటే చాలా ముందుకు వెళ్ళారనే అభిప్రాయం టీడీపీ నేతల్లో కూడా ఉంది. గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఎన్నో అక్రమాలు..అవతవకలు జరిగాయి. మరి ఇఫ్పుడు అటు కేంద్రంలో మోడీ..ఇటు ఏపీలో జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి?. టీడీపీ నేతల్లో ఇప్పుడు అదే టెన్షన్.

Next Story
Share it