Telugu Gateway
Politics

వెయ్యి శాతం గెలుపు..చంద్రబాబు వంద అనుమానాలు?

వెయ్యి శాతం గెలుపు..చంద్రబాబు వంద అనుమానాలు?
X

ఒక దానికి మరో దానికి ‘లింక్’ కుదరటం లేదు. మే 23 న వెల్లడయ్యే ఫలితాల్లో వెయ్యి శాతం గెలుపు తమదే అని చెబుతున్నారు. కానీ ఈవీఎంలు..వీవీప్యాట్ లపై చంద్రబాబు వంద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నేతలు అసలు రాష్ట్రం వదిలి బయటకు రాలేమంటున్నారు. కారణం ఈవీఎంలు మార్చేస్తారేమో అనే భయంతో అని చంద్రబాబు తెలిపారు. కానీ ఇదే చంద్రబాబు నిత్యం రాష్ట్రం వదిలి పెట్టి..ఢిల్లీ, కోల్ కతా, లక్నో ఇలా పర్యటనలు సాగిస్తూనే ఉన్నారు. ఏపీలో ఆయన పరిస్థితి ఎంత నిశ్చింతగా ఉంటే ఇలా తిరగగలరు?. చంద్రబాబు చెబుతున్నట్లు వెయ్యి శాతం గెలిచే ధీమా ఉంటే ఇంకా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయటం ఎందుకు?. ఎలాగూ చంద్రబాబు తాను గెలుస్తున్నారు కాబట్టి గెలిచిన తర్వాత వచ్చే ఎన్నికలకు అందరినీ కలుపుకుని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేయవచ్చు కదా?

కానీ అదేమీ లేకుండా చంద్రబాబు ఇంకా హైరానా పడుతున్నారంటే ఫలితాల అనంతరం ఓటమి పాలైతే ఈ నెపాన్ని ఈవీఎంలు..కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)పై నెట్టుందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కన్పిస్తోంది. అందుకే ఈ హైరానా అంతా. చివరి మూడు నెలల్లోనే ఏకంగా 30 వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేపడితే తాము ఓడిపోవటం ఏమిటి?. ఇదంతా ఈవీఎంలు..వీవీప్యాట్ ల కుట్ర అనాలంటే ఆ మాత్రం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సిందేగా. చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్నది అదే. వీవీ ప్యాట్ స్లిప్పులను బాక్స్ ల్లో వేసి లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఢిల్లీలో అన్ని పార్టీలు కలసి ధర్నా చేయాలా? లేక వినతిపత్రం అందచేయాలా అనే అంశంపై చర్చిస్తున్నామని తెలిపారు.

Next Story
Share it