Telugu Gateway
Politics

హరిప్రసాద్ ఇంటర్వూ..చిక్కుల్లో చిత్తూరు కలెక్టర్!

హరిప్రసాద్ ఇంటర్వూ..చిక్కుల్లో చిత్తూరు కలెక్టర్!
X

ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ కు అసలు ఈవీఎంలపై ఎందుకు అనుమానం వచ్చింది?. దీని వెనక కారణాలు ఏంటి?. ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. కానీ ఆయన ఈవీఎంలపై తాజా వివాదం నేపథ్యంలో ఓ ప్రధాన పత్రికకు ఇంటర్వూ ఇచ్చారు. అందులో ఆయన చెప్పిన విషయాలు చూస్తే ఎవరికైనా షాక్ కొట్టక మానదు. అవేంటో మీరూ ఓ సారి చూడండి. ‘ 2004లో చంద్రబాబు ఓడిపోతారని మేం ఊహించలేదు. ఆ తర్వాత నేను ఈవీఎం వంటి ఒక నమూనా యంత్రం రూపొందించి చంద్రబాబును కలసి ఈవీఎంను ఎవరైనా హ్యాక్ చేయవచ్చని చెప్పా. ఆయన ఓటమిని అంగీకరిస్తున్నానని చెప్పి ఊరుకున్నారు’. ఇదీ ఇంటర్వ్యూలోని కొంత భాగం. అయితే హరిప్రసాద్ తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడే ఒకటి ఉంది. 2004లో చంద్రబాబు ఓటమి చెందుతారని ఆ పార్టీలో ఉన్న నేతలందరికీ ఎంతో ముందే భవిష్యత్ దర్శనంలా తెలిసిపోయింది. సాక్ష్యాత్తూ అప్పటి ఇంటెలిజెన్స్ శాఖ సర్వేల్లోనే చంద్రబాబుకు 45 సీట్లు మించి రావని తేల్చేసింది. ఆ వార్త ఈ ఇంటర్వ్యూ ప్రచురించిన పత్రికలోనే ఫస్ట్ పేజీలో వచ్చింది ఆ రోజుల్లో.

అలాంటిది వేమూరి హరికృష్ణ 2004లో చంద్రబాబు ఓడిపోతారని నమ్మక పోవటం ఏంటి?. చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తానని చెప్పటం ఏంటి?. అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇంకో కీలక విషయం. నిజంగా ఈవీఎంల్లో పొరపాటు ఉంటే..హరిప్రసాద్ కు ఏదైనా సమాచారం ఉంటే పార్టీపరంగానో..ప్రభుత్వ పరంగానో ఏపీ ముఖ్య ఎన్నికల అధికారికి తెలియజేయాలి?. కానీ పీలేరులో ఓ బూత్ కు సంబంధించిన వీడియో ఒకటి వస్తే ఆయన నేరుగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో మాట్లాడరంట?. ఆయన ప్రభుత్వ సలహాదారా? లేక చంద్రబాబు సలహాదారా?. ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఆయన నేరుగా కలెక్టర్ కు ఎలా ఫోన్ చేస్తారు?. అంతే కాదు..తనకు మళ్ళీ చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న ఫోన్ చేసి అనుమానం ఉంటే ఆ ఒక్క మిషన్ తీసేద్దామని చెప్పారన్నారు. అంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాన్ని అటు ప్రద్యుమ్న...ఇటు హరిప్రసాద్ లు ఇద్దరూ సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటారా?. ఎన్నికల కమిషన్ కు ఎలాంటి సంబంధం ఉండదా?. అంటే చంద్రబాబునాయుడు ప్రభుత్వ యంత్రాగాన్ని ఎలా వాడుకున్నారో దీన్ని బట్టే అర్థం అవుతోంది. అసలు ఎన్నికలకు సంబంధించిన అంశాలతో ప్రభుత్వ సలహాదారుకు సంబంధం ఏంటి?.ఆయనకు ఎన్నికల సంఘం ఏమైనా బాధ్యతలు ఏమైనా అప్పగించిందా?. ఆ ఇంటర్వ్యూ చూస్తేనే ప్రభుత్వపరంగా ఎన్ని ప్రయత్నాలు జరిగాయో కళ్ళకు కట్టినట్లు కనపడుతోంది. ఆయన తాజా ఇంటర్వ్యూ టీడీపీలో కలకలం రేపుతోంది. ఇది కొత్త సమస్యలు సృష్టించేదిగా ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it