Telugu Gateway
Politics

ఇరవై హైదరాబాద్ ల ‘చంద్రబాబు కామెడీ’

ఇరవై హైదరాబాద్ ల ‘చంద్రబాబు కామెడీ’
X

అమరావతిలో శాశ్వత రాజధానికి సంబంధించిన ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క భవనం పూర్తి చేయలేదు. మరో రెండు, మూడేళ్లలో కానీ ఇవి పూర్తయ్యే అవకాశం లేదు. పలు శాశ్వత భవనాలకు సంబంధించి ఇంకా పనులు కూడా ప్రారంభం కాలేదు. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుభవంతో అద్భుత రాజధానిని నిర్మిస్తాడని ఆశించిన వారికి ఈ దఫా నిరాశే మిగిలింది. తొలి రోజుల ప్రణాళిక ప్రకారం రివర్ ఫ్రంట్ తో ఆకర్షణీయమైన టవర్లు నిర్మించి..వీటిని చూపి ఎన్నికలకు వెళదామని ప్రభుత్వ పెద్దలు ప్లాన్ రెడీ చేసుకున్నారు. కానీ తర్వాత ఇందులో రాజకీయం జొరబడి ప్లాన్ మారింది. ఇప్పుడు చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో జగన్ సీఎం అయితే అమరావతిని ఇక్కడ నుంచి తరలిస్తారని ప్రచారం మొదలుపెట్టారు. రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలు..ఐఏఎస్ ల కోసం నివాస సముదాయాలు ఇప్పటికే రెడీ అయ్యాయి. సెక్రటేరియేట్ టవర్ల పనులు నిర్మాణ సంస్థలకు కేటాయించారు.

మరి జగన్ వస్తే కట్టిన అపార్ట్ మెంట్లను..సచివాలయ భవనాలతోపాటు ఇతర భవనాలను కూడా ప్రకాశం జిల్లాకో..పులివెందులకో ఎత్తుకెళతారా?. అది సాధ్యం అయ్యే పనేనా?. మరి చంద్రబాబు ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు?. అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోణంలోనే అని చెప్పొచ్చు. ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేయటం ద్వారా అత్యంత కీలకమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ సీట్లు పొందాలనేది టీడీపీ ఎత్తుగడ. మిగిలిన జిల్లాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్లు నివేదికలు వస్తుండటంతో...ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కన్పిస్తోంది. ఇలాంటి ప్రచారం ద్వారా ఈ రెండు జిల్లాల్లో ప్రజల తీర్పు టీడీపీకి వన్ సైడ్ ఉండేలా చూసుకోవాలన్నది ప్లాన్. అయినా సరే చంద్రబాబు ప్రయత్నాలు క్షేత్ర స్థాయిలో పెద్దగా ఫలితాలు ఇస్తున్నట్లు కన్పించటం లేదు. ఐదేళ్ళలో ఒక్క శాశ్వత రాజధాని భవనాన్ని కూడా నిర్మించని చంద్రబాబు నాయుడు ఏపీలో కొత్తగా 20 హైదరాబాద్ లు అభివృద్ధి చేస్తానని ప్రకటించటం పెద్ద కామెడీగా ఉందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఏపీలో హైదరాబాద్ లు ఎందుకు?. ఈ నినాదం ఆ ప్రాంత ఉనికిని ఇది అవమానించటం కాదా? అనే వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.

Next Story
Share it