Telugu Gateway
Cinema

‘టైగర్ కెసీఆర్’ అంటున్న వర్మ

‘టైగర్ కెసీఆర్’ అంటున్న వర్మ
X

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. ‘టైగర్ కెసీఆర్’ టైటిల్ తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇది కేటీఆర్‌ తండ్రి బయోపిక్‌. ఆంధ్రపాలకుల పాలనలో తెలంగాణ ప్రజలు అణచివేతను తట్టుకోని కేసీఆర్‌ ప్రత్యేకరాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారనే’ విషయాలను చిత్రంలో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగానే వర్మ ఈ సినిమా అంశాలను ప్రస్తావించటంతోపాటు..సినిమా టైటిల్ ను కూడా విడుదల చేశారు. ‘ టైగర్ కేసీఆర్‌‌’ సినిమా టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ.. ది అగ్రెసివ్‌ గాంధీ.. ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రూ’ అని క్యాప్షన్‌గా పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. మరి వర్మ తెరకెక్కించే టైగర్ కెసీఆర్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే.

ఎందుకంటే వర్మ ఏది చేపట్టినా అంత కూల్ గా ఏదీ ముందుకు సాగదు. ఎందుకంటే వివాదాలు లేనిది ఆయనకు నిద్రకూడా పట్టదు. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా ఏకంగా ఏపీలో విడుదలకు కూడా నోచుకోలేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో వర్మ కేసీఆర్ జీవితం ఎంతో నాటకీయంగా ఉంటుందని, ఆయన అనుమతి తీసుకొని బయోపిక్ తీస్తానని వెల్లడించారు. ఆయన తాజా ట్వీట్‌లు చూస్తుంటే ఈ బయోపిక్‌కు కేసీఆర్‌ అనుమతి లభించినట్లే భావించాలేమో.

Next Story
Share it