Telugu Gateway
Politics

టీడీపీకి 110 సీట్లు వస్తాయంటున్నారు

టీడీపీకి 110 సీట్లు వస్తాయంటున్నారు
X

ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే తెలుగుదేశం ఈవీఎంలపై గగ్గోలు పెడుతుందనే ప్రచారం ఏ మాత్రం నిజం కాదని తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో 110-140సీట్లు టిడిపి సాధిస్తుందనేది సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గెలుపు 1000% తథ్యం అని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ వీవి ప్యాట్ లను తీసుకొచ్చిన ఘనత టిడిపిదే. ఎన్నికల సంఘంపై పదిహేనేళ్లుగా టిడిపి పోరాడుతోంది. ఈవిఎంలు వద్దని దేశంలోని అనేక పార్టీలు కోరాయి. ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక్కక్షమాపణతో సరిపెడతారా..?వీవి ప్యాట్ లపై రూ.9వేల కోట్ల ఖర్చు ప్రజల్లో నమ్మకం కోసమే. 23పార్టీల పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే. 50% వీవి ప్యాట్ రశీదులు లెక్కించడానికి ఎందుకు అభ్యంతరం..?కౌంటింగ్ వారం రోజులు ఆలస్యం అవుతుందనేది కట్టుకథలు మాత్రమే. తెలంగాణలో పోలైన ఓట్ల కన్నా,ఈవిఎంలలో ఓట్లు ఎక్కువ వచ్చాయి. దీనితో ఈవిఎంలపై ప్రజల్లో విశ్వసనీయత పోయింది. పోల్ అయిన ఓట్లు, ఈవిఎంలలో నమోదైనవి, వీవి ప్యాట్ రశీదులు ట్యాలీ కావాలి.

గతంలో బ్యాలెట్ విధానంలో పోల్ అయిన ఓట్లన్నీ ట్యాలీ అయ్యేవి. టెక్నాలజీ వచ్చాక ట్యాలీ కావడం లేదు. దీనితో ఈవిఎంలపై ప్రజల్లో విశ్వసనీయత పోయింది. టెక్నాలజీతో ప్రజాస్వామ్యంలో పారదర్శకత పెరగాలి. ఈవిఎంలతో ప్రజాస్వామ్య విశ్వసనీయత ప్రశ్నార్ధకం కారాదు. బాబాయి హత్యచేయబడితే, గుండెనొప్పిగా చిత్రిస్తే పట్టించాం. 8లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేస్తే పట్టించాం. దొంగలను పట్టించడం కోసమే పోలీస్ ఉద్యోగం చేస్తున్నాం. గెలుపుపై అనుమానంతో కాదు తెలుగుదేశం పార్టీ పోరాటం. దొంగలను పట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యం. గెలుపుపై భయంతోనే ఈవిఎంలపై టిడిపి పోరాటంగా దుష్ప్రచారం. ప్రతి సర్వే గెలిచేది తెలుగుదేశం పార్టీయే అని చెబుతోంది. టిడిపి పోరాటం చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిలబట్టడానికే. టిడిపి శ్రేణులన్నీ సమన్వంగా, సంఘటితంగా పనిచేశాయి. అన్నివర్గాల ప్రజలంతా కదిలివచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. అందుకే ఈ ఎన్నికలో టిడిపి గెలుపు ఏకపక్షం అయ్యింది. టిడిపికి అండగా నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it