Telugu Gateway
Politics

ప్రశాంత్ కిషోర్ టీమ్ లెక్క 117 సీట్లు!

ప్రశాంత్ కిషోర్ టీమ్ లెక్క 117 సీట్లు!
X

వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు. వైసీపీ తరపున పనిచేసిన టీమ్ కు జగన్ కృతజ్ణతలు తెలియజేశారు. ఐ ప్యాక్ సిబ్బందితో కొద్దిసేపు సమావేశం అయ్యారు. ఎన్నికల సమయంలో కూడా ఐ ప్యాక్ సంస్థ పోలింగ్ ట్రెండ్ ను పరిశీలించింది. తెలుగుదేశం పార్టీ తమకు తురుపుముక్కగా ఉపయోగపడుతుందని భావించిన పసుపు-కుంకుమ కూడా పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని వీరి లెక్కల్లో తేలిపోయింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. పలు చోట్ల బ్యాంకుల్లో జమ అయిన మొత్తాలను పాత రుణాలపై అప్పులకు సర్దుబాటు చేసుకోవటం, మరికొన్ని చోట్ల నగదు చేతికి అందకపోవటం..అందరికీ ఈ మొత్తాలు అందకపోవటం వంటి పలు అంశాలు ఉన్నాయి. పసుపు-కుంకుమ ప్రభావాన్ని మదింపు చేసిన తర్వాత కూడా వైసీపీకి 117 సీట్లు వస్తాయని ఐ ప్యాక్ అంచనా వేసినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. అందుకే అధికార టీడీపీ ఓ వైపు ఈవీఎంల్లో గోల్ మాల్..మోసాలు అంటూ గగ్గోలు పెడుతున్నా జగన్ మాత్రం మౌనంగా కూర్చుతున్నారు. ఏ కోణంలో చూసుకున్న వైసీపీకి వచ్చే 110 పైనే ఉంటాయని ఆ పార్టీ వర్గాలు గట్టి ధీమాతో ఉన్నాయి.

ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ కు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా ఏకంగా తమకు 130 సీట్లు వస్తాయని మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ళ పాటు అద్భుతంగా పాలించామని చెప్పుకుంటున్న టీడీపీ చివరి నిమిషంలో తలపెట్టిన పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపుపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇవే తమను గట్టెక్కిస్తాయని ధీమాగా ఉంది. అయితే చంద్రబాబు శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన తీరు చూసిన తర్వాత మాత్రం టీడీపీ నేతల్లో కూడా సందేహాలు మొదలయ్యాయి. మరి ఎవరి లెక్కలు నిజం అవుతాయో వేచిచూడాల్సిందే. చంద్రబాబు 130 సీట్లు నిజం అవుతాయా? లేక ప్రశాంత్ కిషోర్ టీమ్ 117 సీట్లు లెక్క పక్కా అవుతుందా తెలియాలంటే మాత్రం మే 23 వరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it