Telugu Gateway
Politics

రాజకీయ నేతల ‘విదేశీ బాట’!

రాజకీయ నేతల ‘విదేశీ బాట’!
X

ఓటు వేట ముగిసింది. ‘లెక్కలు’ కూడా తేలుతున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. సొంత లెక్కలు ఎలా ఉన్నా అసలు ఫలితం తేలాలంటే.. అబ్బో 41 రోజులు వేచిచూడాల్సిందే. అంత టెన్షన్ భరించాలంటే సాధ్యమా?. అంటే ఒకింత కష్టమే అని చెప్పొచ్చు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళ ఫోన్లే ఎక్కడ లేని విధంగా మోగుతూనే...ఉన్నాయి. ఎందుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు వస్తాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ..రచ్చ. వీళ్ళ పరిస్థితే ఇలా ఉంటే ఇక పోటీ చేసిన అభ్యర్ధుల టెన్షన్ ఎలా ఉంటుంది. అది అనుభవించే వారికే తప్ప..ఇతరులకు తెలియటం కష్టం. గతంలో ఎన్నికలకు..ఫలితాలకు మధ్య ‘ఇంత గ్యాప్’ ఎన్నడూలేదు. ఇది కూడా నేతలను పిచ్చెక్కిస్తోంది. అందుకే నియోజకవర్గాల వారీగా అన్ని రకాల ‘లెక్కలు’ చూసుకుని ఎంచక్కా ఓ పక్షం రోజులు విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే గత నెలన్నర రోజులుగా..మాంచి ఎండల్లోనూ ప్రచారం..టెన్షన్..టెన్షన్. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ పొందటానికి చాలా మంది నేతలు ‘విదేశీ’ పర్యటనలకు ప్లాన్ చేసుకుంటున్నారు.

మెజారిటీ నేతలు ఈ బాటలోనే ఉన్నారు. అలా కాదని ఇక్కడ ఉన్నా నియోజకవర్గంలోని నేతల నుంచి తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటి అన్నింటికి విరుగుడే ‘విదేశీ బాటే’ బెటర్ అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతి సారీ ఎన్నికల తర్వాత మంత్రులు..ఎమ్మెల్యేలు ఇలా పర్యటనలకు వెళ్ళటం మామూలే అయినా.. ఈ సారి ఎన్నికలకు ఫలితాలకు మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉండటంతో అన్ని రకాల ‘ఒత్తిళ్ళ’ నుంచి విముక్తి కోసం టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. వీరంతా ఓ పక్షం రోజులు ఎవరికీ చిక్కకుండా మిస్ కానున్నారు. సరిగ్గా ఫలితాల వెల్లడికి ఓ వారం ముందు రంగంలోకి దిగి అంతా సెట్ చేసుకోనున్నారు. ఇంత కాలం ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టిన వారు..ఇప్పుడు సొంతం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టుకుని విదేశీ పర్యటనలు పెట్టుకోవటం ఓ లెక్కా?.

Next Story
Share it