Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ లో చేరిన మండవ

టీఆర్ఎస్ లో చేరిన మండవ
X

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వివాదరహితుడైన మండవకు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల బరిలో పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు వేయటం, అక్కడ ఎన్నిక అత్యంత కీలకంగా మారటంతో సీఎం కెసీఆర్ వేగంగా పావులు కదిపారు. ఏ మాత్రం రిస్క్ తీసుకోవటానికి ఆసక్తి చూపని ఆయన స్వయంగా శుక్రవారం నాడు హైదరాబాద్ లోని మండవ నివాసానికి వెళ్ళి మరీ చర్చలు జరిపారు. చర్చల అనంతరం టీఆర్ఎస్ లో చేరటానికి మండవ కూడా అంగీకరించారు. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కెసీఆర్ కుమార్తె కవిత మరోసారి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

సాక్ష్యాత్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడే తెలంగాణలో పార్టీని పూర్తిగా వదిలేశారు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో కనీసం బరిలో కూడా నిలవకుండా మౌనంగా ఉండిపోయింది. మండవ వెంకటేశ్వరరావు గతంలో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, నిజామాబాద్‌ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, పారిశ్రామికవేత్త గాయత్రి గ్రూప్ ఇండస్ట్రీస్ యజమాని గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. గాయత్రి రవి ఇవాళ సాయంత్రం తన అనుచరులతో కలిసి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఆయన 2018 వరంగల్‌ (తూర్పు) నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రవి పోటీ చేశారు.

Next Story
Share it