Telugu Gateway
Politics

ఓటు ‘రూటులో పరుగులు’

ఓటు ‘రూటులో పరుగులు’
X

అందరిదీ అదే బాట. ఓటు రూటులో నగరం ప్రయాణం అయింది. హైదరాబాద్ నుంచి లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరిపోయారు. చాలా మందికి ఇటు హైదరాబాద్ తోపాటు ఏపీలోనూ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే పూర్తవటం, ఏపీలో అసెంబ్లీ పోరు అత్యంత రసవత్తరంగా ఉండటంతో ఈ సారి తమ ఓటు అక్కడే వేయాలని ఎక్కువ మంది నిర్ణయించుకున్నారు. అందుకే అందరూ ఏపీ బాట పట్టారు. హైదరాబాద్ లో ఉద్యోగాలు..వ్యాపారం చేసుకుంటున్న లక్షలాది మంది కసితో తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసేందుకు రెడీ అయిపోయారు. ఎన్నడూ లేనంత ఉత్కంఠ పోరు ఈ సారి ఏపీలో సాగుతోంది. చాలా మంది ఓటర్లు బస్సులు..రైళ్ళు..కొంత మంది కార్లలోనూ తమ తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. హైదరాబాద్ లో ఉంటున్న కొంత మందిని పలు పార్టీలు ఓటు వేసేందుకు పిలిపించుకుంటుండగా..మరి కొంత మంది మాత్రం సొంతంగానే ప్రయాణాలు పెట్టుకున్నారు. దీంతో రైళ్ళు, బస్సులతో పాటు హైదరాబాద్-విజయవాడ రహదారి అత్యంత రద్దీగా మారిపోయింది. సంక్రాంతి సమయం కంటే ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఈ సమయంలో కొన్ని బస్సులు రద్దు కూడా ఓటర్లలో కలకలం రేపుతోంది. అయితే కావేరీ ట్రావెల్స్ కు చెందిన వందకు పైగా బస్సుల రద్దు రావటంతో ఇంత మందిని గమ్యస్థానాలకు చేర్చే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాధ్యమవుతాయా? అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏది ఏమైనా అధికారం నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్న టీడీపీ, ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతున్న వైసీపీలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తన్నారు. జాతీయ రహదారిపై అనూహ్య రద్దీతో హైదరాబాద్‌ -విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి నుంచే ఈ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. విజయవాడ వైపుకు వెళ్లే వాహనాలు పోటేత్తడంతో.. ట్రాఫిక్‌ జామ్‌ భారీగా అయ్యింది. టోల్‌ ఫీజులేకుండా వాహనాలను వదిలిపెట్టాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story
Share it