Telugu Gateway
Cinema

‘చిత్రలహరి’ మూవీ రివ్యూ

‘చిత్రలహరి’ మూవీ రివ్యూ
X

కల కన్న ప్రతి ఒక్కడూ కలాం కాలేడు. ఓ సారి జుట్టు రాలాలని నిర్ణయించుకున్నాక లక్ష రూపాయల షాంపూ పెట్టి తలస్నానం చేసినా చుట్టు పోవటం ఆగదు. అలాగే ప్రేమ పుట్టాలని నిర్ణయించుకున్నాక..ఏమి చేసినా అది ఆగదు. ఇలాంటి పంచ్ డైలాగ్ లతో పాటు మరెన్నో ఆకట్టుకునే సంభాషణలతో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ కొట్టాడు. దర్శకుడు కిషోర్ తిరుమల తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించి సాయిధరమ్ తేజ్ ను కూడా ట్రాక్ లో కి తెచ్చాడనే చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేథా పేతురాజ్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గత సినిమాలతో పోలిస్తే సాయి ధరమ్ తేజ్ ను ఎక్కడా ట్రాక్ తప్పకుండా దర్శకుడు పూర్తి సక్సెస్ సాధించారు. తొలిసారి సినిమా అంతా పూర్తి స్థాయి గడ్డంతో కన్పించిన సాయిధరమ్ తేజ్ ‘సక్సెస్’ కోసం తపన పడే యువకుడి పాత్రలో మెప్పించారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా దరిచేరని సక్సెస్ కోసం హీరో పడే కష్టాలు..మధ్యలో కళ్యాణి ప్రియదర్శన్ తో ప్రేమ..ఆ ప్రేమను బ్రేకప్ చేయటంలో మరో హీరోయిన్ నివేథా పాత్రలతో సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. కారులో ప్రయాణిస్తున్న వారు ఎక్కడైనా ప్రమాదానికి గురైతే ఆటోమేటిక్ గా ఆ సమాచారం ఆస్పత్రి, బ్లడ్ బ్యాంక్, పోలీసు స్టేషన్ లకు చేరేలా ఓ యాప్ డిజైన్ చేస్తాడు హీరో. అయితే ఈ యాప్ డెవలప్ మెంట్ కు అవసరమైన సాయం కోసం ప్రయత్నిస్తాడు. అంతా ఓకే అవుతుందనుకున్న దశలో కారు ప్రమాదానికి గురైనప్పుడు మొబైల్ కూడా పనికి రాకుండా పోతే పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ప్రాజెక్టుకు బ్రేక్ పడుతుంది. చివరకు ఫోన్ తో సంబంధం లేకుండా కారులోనే ఓ ప్రత్యేక డివైజ్ పెట్టి తన కారును తానే ప్రమాదానికి గురి చేసుకుని టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తాడు హీరో.

చివరకు ఈ ప్రయత్నం చేసిన హీరోపై ఆత్మహత్యాయత్నం కేసు..ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చటం వంటి కేసులు దాఖలు అయి వ్యవహారం కోర్టు వరకూ వెళుతుంది. కానీ ఈ యాప్ ఎంతో మంది ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడేది కావటంతో కోర్టు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ సినిమాలో చాలా గ్యాప్ తర్వాత సునీల్ కూడా ఓ పూర్తి స్థాయి పాత్రను దక్కించుకున్నాడు. సెకండాఫ్ లో ఎంటరైనా వెన్నెల కిషోర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలో పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ రిచ్ నెస్ సినిమాలో ప్రతి సీన్ లోనూ కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ‘చిత్రలహరి’ ఓ వేసవిలో ఓ చిరుజల్లు లాంటి సినిమా.

రేటింగ్. 3.25/5

Next Story
Share it