Telugu Gateway
Politics

జీవితంలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోరాటం ఎదుర్కోలేదు

జీవితంలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోరాటం ఎదుర్కోలేదు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా టీడీపీ గెలుపు ఖాయం అని..120 నుంచి 130 సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు..తాజాగా టెలికాన్ఫరెన్స్ లో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జీవితంలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోరాటం ఎదుర్కోలేదని చంద్రబాబు అన్నారు. ‘విశ్లేషణలన్నీ ఊహాత్మకం..ఎన్నికల ఫలితాలే వాస్తవికం’ అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉన్నా...ఇంత కాలం గెలుపు ధీమా ఇచ్చిన చంద్రబాబు ఇప్పడు..ఎందుకు ఇలా మాట్లాడారు అన్నది ఆసక్తికర పరిణామం. పార్టీ నేతలతో గురువారం నాడు నిర్వహించిన టెలికాన్పరెన్స్ లో ‘సీబీఆన్ ఆర్మీ’ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్దరంగంలో సైన్యంలా సిబిఎన్ ఆర్మీ పనిచేసిందని వ్యాఖ్యానించారు. కుప్పంలోనే 3200మంది, రాష్ట్రవ్యాప్తంగా 80వేల ఆర్మీ పనిచేసిందని తెలిపారు. చాలా మంది ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ పార్టీకి సేవలందించారని తెలిపారు. టెలికాన్ఫరెన్స్ లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...‘బాగా పనిచేసినవారు, పని చేయనివారి వివరాలు చెప్పాలి. ఓటింగ్ పెరగడానికి దారితీసిన అంశాలు వివరించాలి.

ఆధిక్యతలు పెరగడానికి దోహదపడిన అంశాలు పేర్కొనాలి. అంతర్గతంగా సహకరించినవాళ్లు, వ్యతిరేకించిన వాళ్ల గురించి చెప్పాలి. పార్టీలో నాయకత్వ బేరీజుకు ఈ నివేదికలే ప్రామాణికం. ఈ ఎన్నికల్లో కాల్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు. ఎప్పటికప్పుడు ప్రతి దశలోనూ సర్వేలు ఉపయోగపడ్డాయి. ఈ సర్వేలలో, విశ్లేషణల్లో వందలాదిమంది సేవలు అందించారు. జీవితంలో ఏ ఎన్నికలోనూ ఇంత పోరాటం ఎదుర్కోలేదు. టిడిపి శ్రేణుల్లో ఇంత పోరాట పటిమ గతంలో ఎప్పుడూ చూడలేదు. కార్యకర్తలంతా ఒకరితో ఒకరు పోటిపడి పనిచేశారు. అక్కడక్కడా నాయకుల్లో కొందరు డ్రామాలాడినా నడవలేదు. ఒకరిని మరొకరు విమర్శించుకోవడం సరికాదు. మీ విశ్లేషణలు, రాబోయే ఫలితాలతో బేరీజు వేసుకోవాలి. మీ విశ్లేషణ సామర్ధ్యానికి అవే గీటురాళ్లు. ఎవరెవరు శక్తికి మించి పనిచేశారు..? శక్తి ఉన్నా ఎవరెవరు సరిగ్గా పని చేయలేదు..? అన్నింటి సమగ్ర సమాచారం నివేదికలు పంపాలి. పద్దతి ప్రకారం చేస్తే ప్రతి ఎన్నికలో ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కోగలం. పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిది లేదని చాటాం. కష్టాలు తెలుగుదేశం పార్టీకి కొత్తకాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం కాబట్టే టిడిపి రాటుదేలింది. మోడి దుర్మార్గాల మధ్య ఈ ఎన్నిక ప్రజల సహనానికి పరీక్ష. ఎన్నికల్లో ధనప్రవాహానికి మొదటి ముద్దాయి మోడియే. ప్రతి ఎన్నికలో 80% ఓటింగ్ టిడిపికే రావాలి. కులాల వారీగా రాష్ట్రంలో ఓటింగ్ చీలిపోరాదు. అభివృద్ధి ప్రాతిపదికనే ఓటింగ్ జరగాలి. పేదల సంక్షేమం చేసిన పార్టీకే ప్రజల మద్దతు ఉండాలి.

కులాలు,మతాల పేరుతో చీలికలు సమాజానికి చేటు. అభివృద్ధి, సంక్షేమానికి ఈ చీలికలే అడ్డుగోడలు. ఈ ఎన్నికల్లో మహిళలు,బిసిలు 100% టిడిపినే ఆదరించారు. ఎస్సీలు,ఎస్టీలు,ముస్లింలలో అత్యధిక ఆదరణ టిడిపికే. ఇంకా యువతరాన్ని టిడిపి వైపు మరింతగా ఆకట్టుకోవాలి. ప్రజల్లో నిరంతర చైతన్యమే అసలైన రాజకీయం. అన్నివర్గాల్లో అవగాహన పెంపే నాయకత్వ లక్షణం. ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్ధికంగా అండగా ఉంటాం. ప్రతి కార్యకర్త కుటుంబానికి ఉపాధి,ఉద్యోగ అవకాశాలు. మే 1 నుంచి పార్లమెంట్ వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు’ అని చంద్రబాబు తెలిపారు. కౌంటింగ్ లో ఆఖరి నిమిషం దాకా ఎవరూ బైటకు రాకూడదని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యేదాకా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు పూర్తి కావడంతో ప్రత్యర్ధుల కుట్రలు ముగియలేదు. ఫలితాలు వెల్లడి అయ్యేదాకా వైసిపి,బిజెపి కుట్రలు కొనసాగిస్తారు అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it