Telugu Gateway
Politics

సుజనాకు సీబీఐ షాక్

సుజనాకు సీబీఐ షాక్
X

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ ఝలక్ ఇచ్చింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో విచారణకు తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామం టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన ఆయన్ను ..ఇప్పుడు సీబీఐ పిలిపించటం ఆసక్తికర పరిణామంగా మారింది. 2017లో నమోదు చేసిన కేసులో ఆయనకు సీబీఐ బెంగళూరు బ్రాంచ్‌ సమన్లు జారీ చేసింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు మొత్తం 364 కోట్ల రూపాయయల మేర నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆయన రేపు మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు హాజరు కానున్నారు. ఒక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 133 కోట్ల రూపాయలు డిఫాల్ట్ కాగా, ఆంధ్రా బ్యాంకుకు 71 కోట్ల రూపాయలు డిఫాల్ట్ అయింది.

అదే సమయంలో కార్పొరేషన్ బ్యాంకు కు 159 కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చారు. సుజనా చౌదరికి చెందిన సొంత భవనం నుంచే బెస్ట్ క్రాంఫ్టన్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించింది. ఇతర సుజనా కంపెనీలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ లో తనిఖీలు చేసిన ఈడీ సుజనా చౌదరికి వివిధ షెల్ కంపెనీలకు చెందిన 126 స్టాంపులను స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు పలు డ్యాక్యుమెంట్లు కూడా ఈడీ తనిఖీల్లో బయటపడ్డాయి. సుజనా చౌదరి ఛైర్మన్ గానే ఈ కంపెనీలు అన్నీ పనిచేస్తున్నాయని..తమ కంపెనీకి సంబంధించి కూడా పూర్తి బాధ్యత సుజనాదే అని బెస్ట్ క్రాంప్టన్ డైరక్టర్లు వెల్లడించినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే సీబీఐ సమన్లపై సుజనా చౌదరి స్పందించారు. సీబీఐ సమన్లలో పేర్కొన్నట్లుగా బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ కంపెనీ గురించి తనకు ఏమాత్రం తెలియదని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు 2017లో సుజనా చౌదరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ బెంగళూరు బ్రాంచ్‌ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.సుజనా గ్రూప్‌ పేరిట లిస్ట్‌ అయిన సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, స్ల్పెండిడ్‌ మెటల్‌ ప్రాడక్ట్స్ లిమిటెడ్‌, న్యూయాన్‌ టవర్స్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో 2003 నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లో మాత్రమే కొనసాగాను. అక్టోబరు 2014 వరకు ఈ కంపెనీల్లో ఏవిధమైన యాజమాన్య బాధ్యతలు చేపట్టలేదు. అక్టోబరు తర్వాత నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లో కూడా కొనసాగలేదు. ఇక బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ కంపెనీ వ్యవహారంలో సీబీఐ నాకు సమన్లు చేసింది. ఆ కంపెనీతో నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని పత్రికా ప్రకటనలో తెలిపారు.

Next Story
Share it