Telugu Gateway
Politics

బిజెపి 160-180 సీట్లతోనే ఆగిపోతుందా?!

బిజెపి 160-180 సీట్లతోనే ఆగిపోతుందా?!
X

కేంద్రంలో మళ్ళీ అధికారం నిలబెట్టుకునే విషయంలో అటు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎక్కడ లేని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటి?. బిజెపి అంతర్గత లెక్కలు ఏమిటి?. అంటే బిజెపి ఈ సారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి చాలా దూరంలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ అంతర్గత లెక్కలే సూచిస్తున్నాయి. బిజెపి ఈ ఎన్నికల్లో సొంతంగా 160 నుంచి 180 కి మించి సీట్లు దక్కించుకునే ఛాన్స్ లేదని బిజెపి నేతల అంతర్గత అంచనాగా ఉంది. బిజెపికి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో భారీ ఎత్తున దెబ్బ పడనున్న విషయం తెలిసిందే. అక్కడ ఎస్పీ, బిఎస్సీ స్నేహం అధికార బిజెపిని దారుణంగా దెబ్బతీయనుంది. ఎన్డీయే మిత్రులతో కలుపుకున్నా ఈ సంఖ్య 200 దాటే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు.

ఈ లెక్కన కేంద్రంలో ఈ సారి ప్రాంతీయ పార్టీలో అత్యంత కీలకంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూలేని రీతిలో బిజెపి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే 282 సీట్లు దక్కించుకుని ‘రికార్డు’ నెలకొల్పింది. అయితే సంకీర్ణ సమస్యలు..ఒత్తిళ్ళు ఏమీ లేకపోయినా ప్రధాని నరేంద్రమోడీ తన పరిపాలనలో ..అభివృద్ధి విషయంలో ‘విజిబుల్ ఇంప్యాక్ట్’ చూపించలేకపోయారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. దీంతోపాటు ఎంతో అట్టహాసంగా ప్రకటించిన ‘ స్మార్ట్ సిటీల’ ప్రాజెక్టులో కూడా పెద్దగా పురోగతి లేదు.

ఈ టర్మ్ లో కనీసం ఎంపిక చేసిన ప్రాంతాలను అయినా ‘స్మార్ట్ సిటీలు’ మార్చి చూపించగలిగితే ఆ ప్రభావం వేరే ఉండేదని..కానీ అదేమీ సాధించలేకపోయామనే విషయాన్ని బిజెపి నేతలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలు పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి. మరో వైపు ‘రాఫెల్ స్కామ్’ మోడీ చుట్టూనే తిరుగుతోంది. ప్రధాని మోడీ మాత్రం ‘అవినీతి రహిత’ పాలన అందించామని..వచ్చే ఐదేళ్ళలో అసలు ప్రగతి చూపిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ పుంజుకొనే ఛాన్స్ ఉన్నా..అధికారంలోకి రావటం అంత ఈజీకాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల తర్వాత ఎవరు ఎంత వేగంగా నెంబర్ గేమ్ లో ‘చక్రం’ తిప్పుతారో వారే కేంద్రంలో అధికారం దక్కించుకునే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story
Share it