Telugu Gateway
Politics

చంద్రబాబు వ్యాఖ్యలు..నైరాశ్యంలో టీడీపీ నేతలు!

చంద్రబాబు వ్యాఖ్యలు..నైరాశ్యంలో టీడీపీ నేతలు!
X

ఎన్నికల తర్వాత టీడీపీ నేతల్లో జోష్ తగ్గిందా?. ముఖ్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యాఖ్యలే వారిలో నైరాశ్యాన్ని నింపాయా?. అంటే ఔననే చెబుతున్నారు పార్టీ నేతలు. అసలు మేమేందుకు ఓడిపోతాం. మాకు 110 నుంచి 130 సీట్లు వస్తాయని అందరూ చెబుతున్నారని చంద్రబాబునాయుడు ఇటీవలే వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల రోజు నుంచి ఆయన పెడుతున్న గగ్గోలు చూస్తుంటే ఓటమి ఖాయం అని స్పష్టం అవటంతోనే..కేవలం ఈ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేందుకే ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారనే అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఎన్నికలు అయిపోయాక ఢిల్లీ వెళ్ళి పోరాటం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సాక్ష్యాత్తూ ఓ మంత్రే తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఉంటే ముందే చేసుకోవాలి కానీ..ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి చేసేది ఏమి ఉంటుందని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. చాలా మంది మంత్రులకు కూడా ఫలితాల విషయంలో ‘క్లారిటీ’ వచ్చేసింది. అందుకే బెట్టింగ్ ల విషయంలో కూడా ఓ వైపు వైసీపీ నేతలు ఫుల్ జోష్ లో పందాలు కాస్తుండగా..టీడీపీ నేతలు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పైగా తమ సన్నిహితులకు పరిస్థితి అనుకూలంగా లేదని..తొందరపడి పందాలు కాసి డబ్బు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.

ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభం అయిన రెండు గంటల తర్వాత నుంచి చంద్రబాబు గగ్గోలు మొదలుపెట్టారు. రాష్ట్రంలోని కోట్లాది ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా తమ ఓటు వేసిన దానికి కాకుండా పక్క పార్టీకి వెళ్ళిందని ఫిర్యాదు చేయలేదు. కానీ సాక్ష్యత్తూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తన ఓటు ఎవరికి పడిందో తెలియదని వ్యాఖ్యానించటం ద్వారా పెద్ద దుమారమే రేపారు. అప్పుడే టీడీపీ నేతలకు అనుమానం మొదలైంది. ఏకంగా పార్టీ అధినేతే ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో నాయకుల్లో ‘గెలుపు’ విశ్వాసం సన్నగిల్లిందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఈ టెన్షన్ కు మే 19న కొంత రిలీఫ్ రావొచ్చు..మే 23న పూర్తి క్లారిటీ వస్తుంది. కాకపోతే ఇప్పటికే చాలా మందికి క్లారిటీ వచ్చింది. రావాల్సింది మాత్రం వాళ్ళకే.

Next Story
Share it