Telugu Gateway
Politics

చంద్రబాబు మోసాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి

చంద్రబాబు మోసాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ..లోక్ సభ ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమర శంఖారావం పూరించారు. కాకినాడ వేదికగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సమావేశంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పటంతో చంద్రబాబు పీహెచ్ డీ చేశారన్నారు. తెలంగాణలో చేసినట్లే లగడపాటితో దొంగ సర్వేలు చేయించి ఏపీలో ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నాలు చేస్తారని..వీరిని చూసి మోసపోవద్దని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఆగమేఘాల మీద ఇప్పుడు రైతు రుణ మాఫీ చివరి విడత నిధులు అంటూ జీవోలు జారీ చేసి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా కార్యకర్తలు చూడాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలు..అన్యాయాలు చేసినా కూడా రాష్ట్రంలోని కొన్ని పత్రికలు..ఛానళ్ళు ఆయన్ను గొప్పవాడిగా చూపిస్తున్నాయని ఆరోపించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించాల్సిందిగా, ఆలోచన చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్పండి.

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు విన్నాం... ఆ తర్వాత చేసిన మోసం చూశాం. మళ్లీ ఎన్నికల వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఒక ప్రత్యేక హోదా అంశాన్నే తీసుకుంటే.. ఎన్నికల ముందు ప్రతేక హోదాపై ఉదరగొట్టిన చంద్రబాబు.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు అడగలేదు. ఇప్పుడు ఎన్నికలచ్చేసరికి మళ్లీ ప్రత్యేక హోదా రాగం అందుకున్నారు. మనం వద్దనుకున్నా.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తీరని అన్యాయం చేసింది. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చలేదు. అలా చేర్చుంటే కోర్టు ద్వారానైనా మనం హోదాను సాధించేవాళ్ళం. ఇచ్చే అవకాశం ఉన్న బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించండి. పవన్‌ కల్యాణ్‌ గురించి కూడా ప్రజలకు చెప్పండి. చంద్రబాబుకు ఓటేయ్యండి, బీజేపీకి ఓటేయ్యండని చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. నాలుగేళ్లు వాళ్లతో కలిసి ప్రయాణించి.. మళ్లీ ఎన్నికలచ్చే సరికి కొత్త కారణాలు చెబుతారు. చంపేటప్పుడు వీళ్లు ముగ్గురు భాగస్వామ్యులు. ఒకరు కత్తి ఇచ్చారు.

ఒకరు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మరోకరు కత్తి తీసుకుని ఆ వ్యక్తిని పొడిచారు. ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదాను హత్య చేశారు. వాళ్లను నమ్మి నమ్మి మోసపోయాం. ఇంకా ఎవరినీ నమ్మవద్దని చెప్పండి. 25కు 25 ఎంపీ సీట్లు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో గట్టిగా చూద్దామ’ని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన డేటా చోరీ కేసులో చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ఒక సైబర్‌ క్రిమినల్‌ అని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. టీడీపీ యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ డేటాను చోరీ చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల డేటాను ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు ఎవరు అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసినందుకు టీడీపీని రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Next Story
Share it