Telugu Gateway
Politics

చంద్రబాబు పార్టనర్..ఓ యాక్టర్

చంద్రబాబు పార్టనర్..ఓ యాక్టర్
X

చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడి పార్టనర్ ఓ యాక్టర్ అని వ్యాఖ్యానించారు. ఆ పార్టనర్ పార్టీకి నిర్మాత, డైలాగ్ లు..అన్నీ చంద్రబాబేనని..డబ్బులు ఇచ్చేది కూడా ఆయనే అని..కేవలం బీఫాంలు మాత్రమే ఆయన ఇస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌ ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించిన సీబీఐ అధికారి తెలుసు కదా. ఆ అధికారిని తెలుగుదేశం భీమిలీ తరపున పోటీ చేయించాలనుకున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పార్టనర్‌ పార్టీలోకి పంపించారు. ఆ యాక్టర్‌ నామినేషన్‌ వేస్తే అక్కడ టీడీపీ జెండాలు కనిపించాయి. ప్రతిపక్ష ఓట్లు చీల్చడానికి చంద్రబాబు ఆడాల్సిన డ్రామాలు ఆడుతున్నారు. మనకు ఇలాంటి డ్రామాలు.. సినిమాలు అవసరం లేదు. దేవుడిని నమ్ముతున్నాను. ప్రజలపై ఆధారపడ్డా. ఎన్ని కుట్రలు పన్నినా వచ్చేది మాత్రం మనందరి ప్రభుత్వమేనని చెబుతున్నా. రాబోయే రోజుల్లో విపరీతమైన డబ్బుతో చంద్రబాబు ఓట్లను కొనాలని చూస్తారు. ఆయన పంచే డబ్బులకు మన నవరత్నాలే పోటీ కావాలి. నవరత్నాలతో ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికి చెప్పాలి’ అని వైఎస్‌ జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన మొత్తం మోసం, అబద్దం, దుర్మార్గంతో సాగింది. రైతుల పటలకు గిట్టుబాటు ధరలు లేవు. రుణ మాఫీ కాక రైతులు అల్లాడుతున్నారు. సున్నా వడ్డీ లేదు, 90 శాతం పూర్తైన ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. రైతులు పడుతున్న బాధలన్నీ చూశాం.. అక్కా చెల్లమ్మలు పడుతున్న ఆగచాట్లను చూశాం. వారి బాధలను చెప్తుంటే విన్నాం. పసుపు కుంకుమతో చంద్రబాబు చేస్తున్న మోసాలను మనమంతా చూశాం. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పూర్తవుతుంది.. ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసిన యువకులను చూశాం. ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్న యువకులను గమనించాం.

వీటన్నిటిని మధ్య నిల్చొని చెబుతున్నా.. మీ బాధలను నేను విన్నాను. మీ అందరికి అండగా నేనున్నాను అని వ్యాఖ్యానించారు. కష్టంలో కూడా ఎలా ధైర్యంగా ఉండాలో నేర్పించింది ఈ పులివెందుల గడ్డ. నాకు సహనాన్ని కూడా నేర్పించింది ఈ గడ్డే. కుట్రలు, కుతంత్రాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది ఈ పులివెందుల గడ్డనే. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుగు వస్తుందని, నిజం కూడా ఏదో రోజు బయటకు వస్తుందని అప్పటి వరకు ఓర్పుగా ఉండాలని నేర్పించింది ఈ గడ్డ. రాతి గడ్డలో ఎలా సేద్యం చేయాలో నేర్పించింది ఈ గడ్డ. మాట కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోవడం ఈ గడ్డ బిడ్డలుగా మనందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it