Telugu Gateway
Politics

కేంద్రంపై కన్నేసిన కెసీఆర్ లోక్ సభ బరిలో నిలవలేదే?

కేంద్రంపై కన్నేసిన కెసీఆర్ లోక్ సభ బరిలో నిలవలేదే?
X

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. గత కొంత కాలంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ హంగామా చేస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లోక్ సభ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నారు?. కెసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ లేదా మెదక్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కెసీఆర్ కేంద్రానికి వెళ్లి రాష్ట్రంలో పగ్గాలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కు అప్పగిస్తారని కూడా పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. తాజాగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ కెసీఆర్ ఏకంగా అవసరం అయితే జాతీయ పార్టీ పెడతానంటూ ప్రకటించారు. గత కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతానంటూ చెప్పిన కెసీఆర్ మరి పోటీకి ఎందుకు వెనకాడారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ క్షేత్రంలో టీఆర్ఎస్ కు ఉన్నంత అనుకూల వాతావరణం మరే పార్టీకి లేదనే చెప్పొచ్చు. అయినా సరే ఎందుకు వద్దనుకున్నారు అన్నది టీఆర్ఎస్ నాయకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

తాజా ఎన్నికల ప్రచారంలోనూ బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో ఘోరంగా విఫలమయ్యాయని..ప్రత్యామ్నాయ వేదిక కావాల్సిందేనని కెసీఆర్ వాదిస్తున్నారు. తన దగ్గర దేశాన్ని పరుగులు పెట్టించేందుకు అవసరమైన ఏజెండా ఉందని చెబుతూ వస్తున్నారు. కెసీఆర్ తాజా నిర్ణయం ప్రకారం ఆయన లోక్ సభ ఫలితాలు వెల్లడైన తర్వాతే ఆయన తన వ్యూహాలు ఖరారు చేసుకునే అవకాశం ఉంది టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం గతంతో పోలిస్తే బిజెపికి సీట్లు 50 నుంచి 60 తగ్గినా కూడా ఎన్డీయే కూటమికే ఎక్కువ ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఏ ప్రాంతీయ పార్టీకి అయినా కేంద్రంలో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ప్రధాన పార్టీకి మెజారిటీ తక్కువ పడినప్పుడే. ఎక్కువ ఎంపీలు ఉన్న వారికే ఎక్కువ డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆచితూచి అడుగులు వేసేందుకే కెసీఆర్ లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it