Telugu Gateway
Telangana

అలా అయితే మీరు ఎలా గెలిచారు వనమా?

అలా అయితే మీరు ఎలా గెలిచారు వనమా?
X

‘ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవటం నా విధిగా భావిస్తున్నా’. ఇదీ కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ అవటానికి నిర్ణయించుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెబుతున్న మాట. నిజంగా వనమా వెంకటేశ్వరరావు చెబుతున్నట్లు కొత్తగూడెంలో ప్రజాభిప్రాయం టీఆర్ఎస్, సీఎం కెసీఆర్ కు అనుకూలంగా ఉన్నట్లు అయితే అక్కడ వనమా వెంకటేశ్వరరావు ఎలా గెలుస్తారు?. ఆ సీటు కూడా టీఆర్ఎసే గెలుచుకోవాలి కదా?. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అభిప్రాయాన్ని వనమా వెంకటేశ్వరరావు తన నియోజకవర్గానికి ఎలా ఆపాదిస్తారు?. అదే నిజం అయితే అక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్ధే గెలిచి ఉండేవారు. కానీ ఫిరాయింపుల కోసం..తమ వాదనలను వినిపించుకోవటానికి ఎవరికి నచ్చిన వాదన వాళ్ళు విన్పించుకంటూ ఓట్లు వేసిన ప్రజలను అవమానించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అందరి బాటలోనే ఆయన కూడా ‘అవసరం అయితే రాజీనామా’ అంటూ పేర్కొన్నారు. అది ఎవరికి అవసరం అవుతుందో..ఎప్పుడు అవసరం అవుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు ‘అభివృద్ధి’వైపు ఆకర్షితులు అవుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి కొత్తగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా చేరారు. ఆయన ఆదివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు నడుచుకోవడమే తన విధి అని వనమా వ్యాఖ్యానించారు.

Next Story
Share it