Telugu Gateway
Politics

తెలుగుదేశం వెబ్ సైట్ డౌన్..మతలబు ఏమిటో!

తెలుగుదేశం వెబ్ సైట్ డౌన్..మతలబు ఏమిటో!
X

డేటా చోరీ కేసుకు..తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ కు లింక్ ఏంటి?. అందులో ఉన్న వివరాలను కూడా తొలగిస్తున్నారా?. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ డేటా చోరీ వ్యవహారం దుమారం రేగుతున్న తరుణంలో టీడీపీకి చెందిన www.telugudesam.org గురువారం ఉదయం నుంచి పని చేయటం లేదు. తెలుగుదేశం పార్టీ కోసం సిద్ధం చేసిన యాప్ లో అత్యంత కీలకమైన ప్రజలకు చెందిన సమాచారాన్ని పొందుపర్చటంతో పాటు..ఐటి గ్రిడ్ కంపెనీకి చేతికి అత్యంత కీలకమైన డేటా అప్పగించారనే ఆరోపణలు గత కొన్ని రోజులుగా కలకలం రేపుతున్నాయి. దీనిపై తెలంగాణ సర్కారు ఏకంగా సిట్ దాఖలు చేయగా..ఏపీ సర్కారు తెలంగాణ పోలీసులే తమ డేటా చోరీ చేశారని..అక్రమంగా ఐటి గ్రిడ్ లోకి ప్రవేశించారని కేసులు పెట్టారు. దీంతో ఇది రాజకీయ వేడి పెరిగింది. ఈ తరుణంలో అకస్మాత్తుగా తెలుగుదేశం వెబ్ సైట్ కూడా పనిచేయకపోవటంతో టీడీపీపై ప్రజల్లో అనుమానాలు మరింత పెంచే అవకాశం ఉందనే విమర్శలు విన్పిస్తున్నాయి.

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కత్తి దాడి సమయంలో దుమారం రేగింది. దాడి చేసింది టీడీపీ కార్యకర్తే అని కొంత మంది ఆ పార్టీ గుర్తింపు కార్డులు సోషల్ మీడియాలో షేర్ చేయటం.. ఆ తర్వాత కాదు..కాదు వైసీపీ కార్యకర్త అని టీడీపీ ప్రత్యారోపణలు చేయటం తెలిసిందే. ఆ తరుణంలో కూడా టీడీపీ వెబ్ సైట్ కొంత కాలం పనిచేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో టీడీపీ వెబ్ సైట్ బ్లాక్ కావటం వెనక మతలబు ఏమై ఉంటుంది అన్న చర్చ సాగుతోంది. అయితే ఏ వెబ్ సైట్ నుంచి అయినా తప్పించుకునేందుకు కీలకమైన వివరాలు తొలగించినా ఐటి నిపుణుల సాయంతో వాటిని తిరిగి పొందవచ్చు. మరి ఎందుకు ఈ తంతు సాగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it